వేతనాలు, పనిగంటలకు సంబంధించి కేంద్ర కార్మిక శాఖ తాజా ప్రతిపాదనలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. వేతనాలపై ఏర్పాటైన లేబర్ కోడ్‌లో దేశ వ్యాప్తంగా రోజువారీ పనిగంటలను 9 గంటలకు పెంచాలన్న ప్రతిపాదనపై కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది. దీనిపై ప్రజాభిప్రాయం కోరింది. నెల రోజుల పాటు ప్రజాభిప్రాయం తీసుకున్న తరవాత డిసెంబర్‌లో దీనిపై తుది నిర్ణయం తీసుకోనుంది. వేతనాలపై లేబర్ కోడ్‌లో పనిగంటల విషయంలో వెంటనే స్పందించి నిర్ణయం తీసుకున్న కార్మిక శాఖ… కనీస వేతనానికి సంబంధించిన ప్రతిపాదనలను పక్కన పెట్టడంపై కార్మిక సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి.కార్మిక శాఖ అంతర్గత నివేదిక ప్రకారం రోజుకు కనీస వేతనం రూ. 375గా నిర్ణయించారు. అలాగే కనీస నెల వేతనం రూ. 9,750గా నిర్ణయిస్తూనే నగర ప్రాంత కార్మికులకు రూ. 1,430ల మేర ఇంటి అలవెన్స్‌గా ప్రతిపాదించారు. మొత్తం దేశాన్ని మూడు కేటగిరీలుగా విభజించారు. 40 లక్షలకుపైబడిన నగరాలను మెట్రోపాలిటన్ నగరాలుగా, 10 లక్షల నుంచి 40 లక్షల లోపు జనాభా ఉన్న ప్రాంతాలను నాన్ మెట్రోపాలిటన్ నగరాలుగా పేర్కొన్నారు. 10 లక్షల లోపు ఉన్నవాటిని గ్రామీణ ప్రాంతాలుగా నిర్ణయించారు. కనీస వేతనం నిర్ణయిస్తూనే… ఇంటి అలవెన్స్ కనీస వేతనంలో 10 శాతం ఉండాలని ప్రతిపాదించారు. మరి వీటిపై కార్మిక శాఖ నిర్ణయం తీసుకోకుండా… పనిగంటల విషయంలో ప్రజాభిప్రాయం కోరడం విచిత్రంగా ఉందని కార్మిక సంఘాలు పేర్కొంటున్నాయి.