గొల్లపూడి మారుతీరావు కన్నుమూత

ప్రముఖ నటుడు గొల్లపూడి మారుతీరావు(80) కన్నుమూశారు. చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆయన తుది శ్వాస విడిచారు. గొల్లపూడి 1939 ఏప్రిల్‌ 14వ తేదీన విజయనగరంలో జన్మించారు. 290కి పైగా చిత్రాల్లో నటించిన గొల్లపూడి… ప్రముఖ రచయిత కూడా. అనేక నాటకాలు, కథలు రాశారు. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య చిత్రంతో నటుడిగా వెండితెరకు పరిచయమయ్యారు.

గొల్లపూడికి ముగ్గురు కుమారులు సుబ్బారావు, రామకృష్ణ, శ్రీనివాస్. ‘ప్రేమ పుస్తకం’ చిత్రానికి దర్శకత్వం వహిస్తూ శ్రీనివాస్ మరణించారు. శ్రీనివాస్ జ్ఞాపకార్థం గొల్లపూడి శ్రీనివాస స్మారక పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. గొల్లపూడి పెద్దకుమారుడు సుబ్బారావు రచయిత. గొల్లపూడి మారుతీరావు నటించిన తొలి చిత్రం: ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య(1982) ఆయన చివరి చిత్రం: జోడి (ఆది సాయికుమార్)

గొల్లపూడి దాదాపు మూడున్నర దశాబ్దాలకుపైగా సినీరంగంలో ఎన్నో భిన్నమైన పాత్రలు పోషించారు. 290కిపైగా చిత్రాల్లో నటించారాయన. దాశరథి ప్రోత్సహంతో గొల్లపూడి సినీ రచయితగా మారారు. దేవులపల్లి కృష్ణశాస్త్రితో కలిసి రచనలు చేసిన గొల్లపూడి , శాస్త్రీయ సంగీతాన్ని ఎక్కువగా ఆస్వాదించేవారు.

1963లో 13 ఏళ్ల వయస్సులోనే ఆల్ ఇండియా రేడియోలో పనిచేసిన మారుతీరావు…14 ఏళ్ల వయస్సులోనే మొదటి కథ ఆశాజీవి రాశారు. దుక్కిపాటి మధుసూదన్ రావు దర్శకత్వం వహించిన డాక్టర్ చక్రవర్తికి రచన చేసి వెండితెరకు పరిచయమయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి 6 నంది పురస్కారాలు గొల్లపూడి అందుకున్నారు. గొల్లపూడి 12 నవలలు, 4 కథా సంపుటాలు, 3 పిల్లల కథలతో పాటు జీవన కాలమ్ పేరుతో అనేక వ్యాసాలు రాశారు.

Related Articles