ఢిల్లీకి చెందిన నజియా నసీమ్ ఎంటర్‌టైన్మెంట్ ప్రొగ్రామ్స్‌లో చరిత్ర సృష్టించారు. కోటి రూపాయల ప్రైజ్‌మనీ గెల్చుకున్న తొలి కోటీశ్వరి అయ్యారు. దీనికి సంబంధించిన ‘కౌన్ బనేగా కరోడ్‌పతి 12’ ఎపిసోడ్ నిన్న రాత్రి సోనీ టీవీలో ప్రసారమైంది. టూ వీలర్ కంపెనీ రాయల్ ఎన్‌ఫీల్డ్‌లో కమ్యూనికేషన్స్ మేనేజర్‌గా పనిచేస్తున్న నజియా నసీమ్‌కు కోటి రూపాయలు తెచ్చిన ప్రశ్న సినిమాలకు సంబంధించింది కావడం విశేషం. ఇంకా విశేషమేమిటంటే కోటి రూపాయల ప్రశ్న ఆమె ఎదురుగా ఉంది. ఒక లైఫ్‌లైన్ కూడా ఉంది. అయినా వాడుకోలేదు. కోటి రూపాయల ప్రశ్నకు ఆమె సమాధానం చెప్పాక… అమితాబ్ పదే పదే జాగ్రత్తగా ఆడండి… లాక్ చేయనా అని మరీ మరీ అడిగ్గా… తన సమాధానం ఎలా కరెక్టో ఆమె వివరించి చెప్పేసరికి… అమితాబ్‌కు ఆన్సర్‌ను లాక్ చేయక తప్పింది కాదు. అది కరెక్ట్ కావడంతో ఇంకా ఒక లైఫ్ లైన్ మిగిలి ఉండగానే ఆమె కోటి రూపాయలు గెల్చుకున్నారు.
దాదాపు 20 ఏళ్ళ నుంచి కేబీసీలో రావడానికి ప్రయత్నించిన నజియా… రావడమే గాక…కోటి రూపాయలు గెల్చుకున్నారు. తన తలిదండ్రులతో పాటు అత్తా మామ ఉన్నారని… వారి ఆరోగ్యం కొంత మొత్తం ఖర్చు చేస్తానని… అలాగే కుమారుడు సాకర్ ఆడతాడని… అతని శిక్షణ కోసం కూడా కొంత ఖర్చు పెడతానని చెప్పారు. మిగిలిన సొమ్ము గురించి కుటుంబ సభ్యులు ఆలోచిస్తామన్నారు. అయితే ఇంత దూరం వస్తానని తాను అనుకోలేదన్నారు. ఇంతకీ ఆమెకు కోటి రూపాయలు తెచ్చిన ప్రశ్న ఏమిటంటే…
ఉత్తమ నేపథ్యగాయనిగా జాతీయ అవార్డు అందుకున్న నటి ఎవరు?
దీనికి ఇచ్చిన ఆప్షన్స్..
1. దీపికా చికిలియా (ఈమె బీఆర్ చోప్రా మహాభారత్‌లో సీతగా నటించారు)
2. కిరణ్ ఖేర్ (ప్రముఖ బాలీవుడ్ నటి, అనుపమ్ ఖేర్ భార్య)
3. నీనా గుప్తా ( ప్రముఖ బాలీవుడ్ నటి)
4. రూపా గంగూలి
వెంటనే రూపా గంగూలి తన సమాధానంగా నజియా చెప్పారు. నటిగా పనిచేసిన రూపా గంగూలి తరువాత రాజకీయ నేతగా ఎలా రాణిస్తున్నదీ నజియా చెప్పారు.ఆమె బెంగాలీ సినిమా కోసం పాడారని నజియా చెప్పారు. ఆమె సమాధానం కరెక్ట్ కావడతో ఆమె కోటి రూపాయలు గెల్చుకున్నారు.
బీజేపీ మహిళా మోర్చా నేతగా పనిచేస్తున్న రూపా గంగూలీ ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. బీఆర్ చోప్రా మహాభారత్‌లో ఆమె ద్రౌపదిగా నటించారు. 2011లో బెంగాలి చిత్రం అబొశేషి సినిమాలో పాడినందుకు ఆమెకు ఉత్తమ నేపథ్య గాయనిగా జాతీయ అవార్డు ఇచ్చారు.