12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలు…
19,039 ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే 18 లక్షల మంది విద్యార్థులకు రోజూ రుచి, శుచి గల భోజనం అందించడం. ఇది అక్షయ పాత్ర రోజువారీ కార్యక్రమం. ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా లక్షలాది మంది విద్యార్థులకు రోజూ అన్నం పెడుతున్న అక్షయ పాత్ర ఇపుడు అవినీతి, నిర్వహణా లోపం వంటి తీవ్ర ఆరోపణలను ఎదుర్కొంటోంది. 20 ఏళ్ళ క్రితం ఓ చిన్న సంస్థగా ప్రారంభమైన అక్షయ పాత్రను ఓ బృహత్ సంస్థగా తీర్చిదిద్దిన నలుగురు స్వతంత్ర ట్రస్టీలు…. సంస్థ నుంచి రాజీనామా చేసి వైదొలగారంటే… పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో చెప్పకనే చెబుతోంది. వండి ఆహారాన్ని తరలించడానికి అక్షయ పాత్ర తొలి వెహికల్‌ను ఏర్పాటు చేసిన వ్యక్తి ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్‌ఓ మోహన్‌దాస్ పాయ్. అలాగే ఆరంభంలోనే నిధుల సమీకరణలో తనవంతు పాత్ర పోషించిన వ్యక్తి క్రిస్‌క్యాపిటల్ వ్యవస్థాపకుడు రాజ్ కొండూర్. అలాగే వి. బాలకృష్ణన్ కూడా. మణిపాల్ విద్యా, మెడిల్ గ్రూప్ సలహాదారు అభయ్ జైన్‌ది కీలక పాత్రే. వీరందరూ అక్షయ పాత్రకు మూల స్తంభాలు. గడచిన 20 ఏళ్ళలో ఈ సంస్థను బలోపేతం చేశారు. 2000 జూన్ నెలలో ఈ సంస్థ 1,500 మంది విద్యార్థులకు భోజనం సరఫరా చేయడంతో తన ప్రయాణం ప్రారంభించింది. పైన పేర్కొన్న నలుగురు చేరడంతో పాటు సంస్థ కోసం తమ వంతుగా రేయంబవళ్ళు కృషి చేశారు. అనేక కంపెనీల ప్రతినిధులతో మాట్లాడారు. నిధులు సమీకరించారు. ప్రభుత్వాలతో మాట్లాడారు. అక్షయ్ పాత్రను విస్తరించారు. 2019-20 ఆర్థిక సంవత్సరంలో అక్షయ్ పాత్రకు రూ. 248 కోట్లు గ్రాంట్లు, నగదు సబ్సిడీ రూపంలో అందితే… మరో రూ. 352 కోట్లు ప్రజల నుంచి విరాళాల రూపంలో వచ్చాయి. అక్షయ్ పాత్రను ఈ స్థాయికి తీసుకు వచ్చింది వీరే అని ప్రతి ఒక్కరికీ తెలుసు. వీరు వైదొలగడంతో ఇక మిగిలింది కేవలం ఇస్కాన్ ప్రతినిధులతో పాటు మరో ముగ్గురే. పైకి అక్షయ్ పాత్ర లాభాపేక్ష లేని సంస్థగా ఎదిగినా… ముందు నుంచి ఈ సంస్థపై నిర్వహణను బెంగళూరులోని ఇస్కాన్ సంస్థ నేతృత్వంలోనే సాగుతోంది. ఇప్పటికీ ఈ ఫౌండేషన్ (ట్రస్టీల బోర్డు) చైర్మన్‌గా ఇస్కాన్ వ్యవస్థాపకుడు మధు పండిత్ దాస ఉన్నారు. వైస్ ఛైర్మన్‌గా కూడా ఇస్కాన్‌కు చెందిన చంచలపతి దాస (ఎస్ చంద్రశేఖర్ అని అంటారు). ట్రస్టీలుగా ఇస్కాన్‌కే చెందిన సత్య గౌర చంద్ర దాస, భరతర్‌సభ దాస ఉన్నారు. ట్రస్టీలో బోర్డులు ఇపుడు ఇంకా మిగిలి ఉన్న వారు మాజీ సీవీసీ కేవీ చౌదరి, మాజీ ఐఏఎస్ ఆఫీసర్ అనిల్ స్వరూప్, థర్మాక్స్ మాజీ సీఈఓ ఎంఎస్ ఉన్నికృష్ణన్.
నిర్వహణ లోపం
అక్షయ పాత్ర ఫౌండేషన్‌కు, ఇస్కాన్ మధ్య సంబంధాలపై ఆరోపణలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. దేవాలయాల ట్రస్టీలకు, ఫౌండేషన్ మధ్య సంబంధం ఉండరాదని… ఫౌండేషన్‌ను పూర్తిగా స్వతంత్ర సంస్థగా నడపాలని మోహన్‌దాస్ పాయ్, బాలకృష్ణన్, రాజ్ కొండూర్, అభయ్ జైన్ కోరుతున్నారు. ముఖ్యంగా ఫౌండేషన్‌కు సంబంధించిన లెక్కలను చూసిన ఆడిట్ కమిటీ పలు అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ పత్రిక వెల్లడించింది. ముఖ్యంగా ఫౌండేషన్ నిధులు, ఇస్కాన్ దేవాలయాల ట్రస్ట్‌లకు వెళుతున్నాయని ఆకాశరామన్న ఉత్తరాల ద్వారా పలువురు వేగులు ఆరోపించినట్లు తెలుస్తోంది. వేగుల ఉత్తరాలను ట్రస్టీల బోర్డుల సమావేశంలో పదే పదే ప్రస్తావించినా … ఇస్కాన్ ట్రస్టీల నుంచి సంతృప్తికరమైన సమాధానం వచ్చినట్లు లేదని పత్రికలు రాస్తున్నాయి. చిత్రంగా పత్రికల్లో ఎక్కడా ఇస్కాన్ పేరు రాకుండా జాగ్రత్త పడటం విశేషం. ఆలయాల ట్రస్టీలు అని పేర్కొంటున్నాయి. గ్రాంట్లు, విరాళాలు వందల కోట్లను దాటుతుండటంతో నిధుల విషయంలో ఆడిట్ కమిటీ మరింత జాగ్రత్తగా ఉండాలని భావిస్తోంది. వేగుల నుంచి వచ్చిన ఉత్తరాలకు ఇస్కాన్ స్పందన అంతంత మాత్రంగానే ఉంది. దాడులు నిర్వహించి సొమ్ము రికవరీ చేశామని ఇస్కాన్ ట్రస్టీలు అంటున్నా…రాజీనామా చేసిన ట్రస్టీలు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఫౌండేషన్ వ్యవహారాలకు దేవాలయాల ట్రస్ట్‌లు దూరంగా ఉంచాలని పదే పదే వీరు కోరినట్లు తెలుస్తోంది. పైగా అక్షయ పాత్ర ఫౌండేషన్‌లో ఇస్కాన్ ట్రస్టీల పెత్తనంపై కూడా వీరు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే అంశంపై ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’తో మాట్లాడుతూ మోహన్‌దాస్ పాయ్ కీలక సూచనలు చేశారు. ఫౌండేషన్‌లో స్వతంత్ర ట్రస్టీల సంఖ్య అధికంగా ఉండాలని, వారు మెజారిటీ సంఖ్యలో ఉన్నపుడే ఫౌండేషన్ నిర్వహణ సక్రమంగా ఉంటుందని అన్నారు. పరోక్షంగా ఆయన ఇస్కాన్ పెత్తనాన్ని ప్రశ్నించినట్లయింది. రాజీనామా చేసిన ఇతర ట్రస్టీలు సాధ్యమైనంత వరకు మీడియాకు దూరంగా ఉంటున్నారు. పాత ట్రస్టీలు కూడా ఫౌండేషన్‌పై మీడియాలో విచారణ జరగరాదని… స్వతంత్ర సంస్థగా ఫౌండేషన్‌ను నిర్వహించాలని వారు కూడా కోరుతున్నారు. నిజానికి బెంగళూరులోని ఇస్కాన్ ఆవిర్భావమే తీవ్ర వివాదాస్పదమైంది. ముంబైకి చెందిన ఇస్కాన్‌కు గుడ్‌బై చెప్పి ప్రస్తుతమున్న ట్రస్టీలు బెంగళూరు ఇస్కాన్‌ను స్వాధీనం చేసుకున్నారని గతంలో వార్తలు వచ్చాయి. అనేక కోర్టు కేసులు కూడా నడిచాయి. ఇపుడు అక్షయలోనూ వీరి పాత్రపై ఆరోపణలు రావడం విశేషం.