లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌పై మారటోరియం

భయపడినట్లే జరిగింది. లక్ష్మీ విలాస్‌ బ్యాంక్‌పై ఆర్‌బీఐ మారటోరియం విధించింది. ఈరోజు సాయంత్రం 7 గంటల నుంచి ఈ మారటోరియం అమల్లోకి వస్తుంది. ఈ మేరకు ఆర్థిక శాఖలోని బ్యాంకింగ్‌ డివిజన్‌ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మారటోరియం నెల రోజుల పాటు అంటే వచ్చే డిసెంబర్‌ 16వ తేదీ వరకు (ఈరోజు కలిపి) అమల్లో ఉంటుంది.తమిళనాడులోని కరూర్‌ కేంద్రంగా పనిచేస్తున్న ఈ బ్యాంక్‌ను టేకోవర్‌ చేసేందుకు అనేక కంపెనీలు ప్రయత్నించాయి. అనేక కారణాలతో సదరు టేకోవర్లను తిరస్కరించింది ఆర్బీఐ. ఇపుడు బ్యాంక్‌పై మారటోరియం విధించింది. డిపాజిటర్లకు రూ.25,000 మించి విత్‌డ్రా చేసుకునేందుకు వీలు లేకుండా ఆంక్షలు విధించింది. సేవింగ్‌,కరెంట్‌, డిపాజిట్‌ అకౌంట్‌… ఏదైనా సరే రూ. 25,000 మించి విత్‌డ్రా చేయడానికి వీల్లేదు. ఒకవేళ ఒకే డిపాజిటర్‌కు పలు ఖాతాలు ఉన్నా… గరిష్టంగా రూ. 25,000 మించి ఇవ్వరాదని స్పష్టం చేసింది. ఒకవేళ బ్యాంకుకే చెల్లించేందుకు ఉద్దేశించిన మొత్తమైతే… ఆ మేరకు ఖాతాల్లో సర్దుబాటు చేయొచ్చని ఆర్థిక శాఖ పేర్కొంది.
అయితే డిపాజిటర్‌ మెడికల్‌ ట్రీట్‌మెంట్‌ ఖర్చులకు, లేదా డిపాజిటర్‌పై ఆధారపడిన వ్యక్తి మెడిల్‌ ట్రీట్‌మెంట్‌ కోసం రూ. 25,000 మించి ఇవ్వొచ్చని పేర్కొంది. డిపాజిటర్‌ గనుకు ఉన్నత విద్య కోసం లేదా డిపాజిటర్‌ ఆధారపడిన వ్యక్తి దేశంలో లేదా విదేశాల్లో ఉన్నత విద్య కోసమైతే పరిమితికి మించి నిధులు జారీ చేయొచ్చు. డిపాజిటర్‌ పెళ్ళికి/ ఇతర ఫంక్షన్లకు, అలాగే డిపాజిటర్‌పై ఆధారపడిన వ్యక్తి పిల్లల వివాహం లేదా ఇతర ఫంక్షన్లకు కూడా పరిమితి మించి ఇవ్వొచ్చని ఆర్థిక శాఖ పేర్కొంది. అనివార్య కారణాలకు కూడా గరిష్ఠ పరిమితి మించి నిధులు ఇవ్వొచ్చని తాజా ఆదేశంలో స్పష్టం చేసింది. అయితే గరిష్ఠంగా రూ. 5 లక్షలకు మించరాదని షరతు పెట్టింది.