ఘంటసాల కుమారుడు కన్నుమూత

సుప్రసిద్ధ గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు కుమారుడు రత్నకుమార్ కన్నుమూశారు. కరోనా బారిన పడిన ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. రెండు రోజుల క్రితం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయనను చెన్నైలోని కావేరి ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున గుండెపోటు రావడంతో తుది శ్వాసవిడిచారు. చాలా రోజులుగా ఆయన కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. దీని కారణంగా ఆయన కొన్ని రోజులుగా డయాలసిస్‌పై ఉన్నారు.

32 ఏళ్లుగా సినీ పరిశ్రమకు రత్నకుమార్ సేవలు అందించారు. డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా ఎన్నెన్నో రికార్డులు కొల్లగొట్టారు. ఆయన మొత్తంగా 1076కి పైగా చిత్రాలకు డబ్బింగ్ చెప్పారు. ఏకధాటిగా ఎనిమిది గంటలు నాన్ స్టాప్‌గా డబ్బింగ్ చెప్పి ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డులకెక్కారు. అంతే కాకుండా తమిళనాడులోనూ ప్రత్యేక రికార్డులు క్రియేట్ చేశారు. తమిళం, తెలుగు, మళయాలం, హిందీ, సంస్కృతం ఇలా అన్ని భాషల్లోనూ డబ్బింగ్ చెప్పేశారు. తెలుగు, తమిళంలో వచ్చే సీరియళ్లలో దాదాపు పది వేల ఎపిసోడ్‌లకు డబ్బింగ్ చెప్పారట. యాభై డాక్యుమెంటరీలకు డబ్బింగ్ చెప్పినట్టు తెలుస్తోంది. అయితే మొదట్లో సింగర్‌గా చాలా ప్రయత్నాలు చేశారట. కానీ సరైన బ్రేక్ రాలేదని చెప్పుకొచ్చేవారు. సింగర్ కొడుకు సింగర్ కావాలన్న రూలేమీ లేదు కదా? అని ఒకసారి తెలుగు సినిమా అయిన కంచి కామాక్షికి తమిళంలో డబ్బింగ్ చెప్పారట. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా అవకాశాలు రావడం, అదే కెరీర్‌గా మారడం జరిగిందట.