కార్టూనిస్ట్‌పై అంబానీ మీడియా సంస్థ వేటు

అసలే ముకేష్‌ అంబానీ కంపెనీ. ప్రభుత్వాన్ని విమర్శించే కార్టూన్లను… మరీ ముఖ్యంగా ప్రధాని మోడీని విమర్శించే కార్టూనిస్ట్‌ను సహిస్తుందా? వెంటనే కార్టూనిస్ట్‌ కాంట్రాక్ట్‌ను సస్పెండ్‌ చేసింది. ముకేష్‌ అంబానీకి చెందిన నెట్‌వర్క్‌ 18 ప్రముఖ కార్టూనిస్ట్‌ మంజుల్‌ను సస్పెండ్‌ చేసినట్లు ద వైర్‌ వెబ్‌సైట్‌ పేర్కొంది. ఇపుడు మీడియాలో ఇదొక పెద్ద హాట్‌టాపిక్‌గా మారింది. కార్టూనిస్టులు, జర్నలిస్టులు మంజుల్‌కు బాసటగా నిలిచారు.

జరిగిందేమిటంటే…
మంజుల్‌ అనే కార్టూనిస్ట్‌ మంజూల్‌టూన్స్‌ పేరుతో కార్టూన్లు వేస్తుంటారు. ఆయనకు న్యూస్‌నెట్‌ 18తో ఒప్పందం ఉంది. ఆయన కార్టూన్లను ఆ సంస్థ వేస్తుంటుంది. ఇటీవల ట్విటర్‌ నుంచి మంజూల్‌కు ఓ లెటర్‌ వచ్చింది. దాని సారాంశం ఏమిటంటే… మంజుల్‌కార్టూన్స్‌ ఉండే హ్యాండిల్‌ మంజుల్‌టూన్స్‌ను తొలగించాల్సిందిగా ట్విటర్‌ను కేంద్ర ప్రభుత్వం కోరిందని. వెంటనే ఆ పని చేయకుండా… తమ సంస్థ విధానాల ప్రకారం సదరు అంశాన్ని మంజుల్‌ దృష్టికి తెచ్చింది ట్విటర్‌. తమ యూజర్స్‌పై వచ్చే ఆరోపణలపై వెంటనే చర్యలు తీసుకోకుండా.. సదరు వ్యక్తి సమాచారం ఇవ్వడంతో పాటు అవసరమైతే మీరు న్యాయ సహాయం తీసుకొమ్మని సలహా ఇస్తుంది ట్విటర్‌. అలాగే మంజుల్‌కు కూడా లెటర్‌ రాసింది. ఈ విషయం తెలిసిన వెంటనే కార్టూనిస్టులు కేంద్ర ప్రభుత్వ వైఖరిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్టూనిస్ట్‌ ఎపుడూ విపక్షంలా వ్యవహరిస్తాడని, ప్రజల పక్షం ఉంటాడని స్పష్టం చేశారు. ఈ గొడవ నడుస్తున్న సమయంలోనే మంజూల్‌ను ముకేష్‌ అంబానీ కంపెనీ నెట్‌వర్క్‌ 18 సస్పెండ్‌ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. రిలయన్స్‌ కంపెనీ వైఖరిపై ఇపుడు సోషల్‌ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి.