ఇక టీవీ ఛానల్స్‌పై ఫిర్యాదులు వస్తే…

టీవీ ఛానల్స్‌లో ప్రసారమయ్యే కార్యక్రమాలపై ప్రేక్షకుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తాజాగా పటిష్ఠమైన వ్యవస్థను ఏర్పాటు చేసిందని కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ తెలిపారు. ఈ మేరకు కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ రూల్స్‌ను సవరించినట్లు ఆయన ప్రకటించారు. ఈ రూల్స్‌ ఆధారంగానే ప్రొగ్రామ్‌, అడ్వర్టయిజ్‌మెంట్‌ కోడ్‌ రూపొందించారు. టెలివిజన్‌ ఛానల్స్‌ వీటిని పాటించాల్సి ఉంటుంది. వీటిని ఉల్లంఘించినా లేదా టీవీ ఛానల్స్‌ కార్యక్రమాలపై వచ్చే ఫిర్యాదులను ఇప్పటి వరకు ఛానల్స్‌ ఏర్పాటు చేసుకున్న స్వయం నియంత్రిత సంస్థలు (self regulatory bodies) పరిష్కరిస్తూ వచ్చాయి. అలాగే కేంద్రంలో అంతర్‌ మంత్రిత్వ శాఖల కమిటీ వీటిని పరిష్కరిస్తూ వచ్చింది. అయితే ఇక నుంచి ఛానల్స్‌ గనుక అలాంటి సంస్థలను ఏర్పాటు చేస్తే.. వాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి గుర్తింపు ఉండాలి . అంటే ఈ సంస్థలకు చట్టపరమైన గుర్తింపు ఉండాలన్నమాట. దేశంలో దాదాపు 900లకు పైగా టెలివిజన్‌ ఛానల్స్‌ ఉన్నాయని వీటిపై వచ్చే ఫిర్యాదుల పరిష్కరానికి పటిష్ఠమైన వ్యవస్థ రూపకల్పన కోసం కేబుల్‌ టెలివిజన్‌ నెట్‌వర్క్‌ రూల్స్‌ను సవరించినట్లు కేంద్రం ప్రకటించింది.