ఈనెల 24న యాప నారాయణ అలియాస్ హరిభూషణ్ భార్య జజ్జర్ల సమ్మక్క అలియాస్ శారద కూడా వైరస్‌తో పోరాడుతూ చనిపోయారని తెలుస్తోంది. 25న దండకారణ్యంలోనే ఆమె అంత్యక్రియలు నిర్వహించినట్లు సమాచారం. యాప నారాయణ అలియాస్ హరిభూషణ్-జజ్జర్ల సమ్మక్క అలియాస్ శారదలు సొంత బావా మరదళ్లు. ఈనెల 21న హరిభూషణ్ కరోనాతో మరణించిన విషయం తెలిసిందే. సమ్మక్క, హరి భూషణ్ మృతితో వీరి 30ఏళ్ల ప్రేమ ప్రయాణం ముగిసి పోయింది. సమ్మక్క మరణవార్తను ఛత్తీస్‌గఢ్ పోలీసులు ధ్రువీకరించారు. కానీ, మావోయిస్టు పార్టీ ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
బావ వెంటనే బతుకు …
వీరిద్దరి మరణంతో మహబూబాబాద్ జిల్లా సొంతూరు గంగారం మండలం మడగూడెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నారాయణ- సమ్మక్కలు చిన్ననాటి నుంచి ఒకరంటే ఒకరికి ఎంతో ఇష్టం. హన్మకొండలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో యాప నారాయణ డిగ్రీ పూర్తి చేశాడు. విద్యార్థిగా రాడికల్ స్టూడెంట్ యూనియన్ (ఆర్ఎస్యూ)తో ప్రభావితమై 1991 తరువాత దళంలో చేరాడు. బావ చదువు పూర్తయ్యాక.. పెళ్లి చేసుకుందామనుకుని ఎన్నో కలలు గన్న సమ్మక్కకు ఈ పరిణామం మింగుడుపడలేదు. పెద్దలు వారించినా వినకుండా అడవిలో ఉన్న నారాయణ వద్దకు వెళ్లిపోయింది. అక్కడే వివాహం చేసుకుంది. బావ కోసం, పార్టీ కోసం పిల్లలు వద్దనుకుంది. ఈ దేశంలోని అభాగ్యులంతా తన పిల్లలే అనుకునే ఆదర్శ మనస్తత్వం సమ్మక్కదని బంధువులు చెప్పారు. భర్త వెంటే అనేకసార్లు ఎన్కౌంటర్లలో తూటాల నుంచి త్రుటిలో తప్పించుకుంది.
తిరిగి మళ్ళీ బావ కోసం
సమ్మక్క 2008లో అనారోగ్య కారణాలతో వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయింది. అప్పటికి ఆమె పేరు మీద ఉన్న రూ.5 లక్షల రివార్డు తనకే ఇచ్చారు పోలీసులు. శస్త్రచికిత్స అనంతరం 2012 వరకు బంధువులతోనే కలిసి ఉంది. అడవిని వదిలివచ్చినా.. సమ్మక్క బావను మరువలేదు. అతన్ని వదిలి ఉండలేక.. నాలుగేళ్ల అనంతరం 2012లో ఎవరికీ చెప్పకుండా తిరిగి నారాయణ వద్దకు వెళ్లిపోయింది. అప్పటి నుంచి వదినను తాము చూడలేదని ఆమె మరిది, హరిభూషణ్ తమ్ముడు అశోక్ చెప్పాడు. ఆదర్శ భావాలున్న అన్నావదినలను స్వల్ప వ్యవధిలో కోల్పోవడం ఎంతో బాధ కలిగించిందని, కడచూపునకు నోచుకోకపోవడం వేదనకు గురిచేస్తోందని వాపోయాడు. ఒకవేళ తన వదిన మరణ వార్త వాస్తవమే అయితే, కనీసం ఆమె మృతదేహాన్నైనా అప్పగించాలని ఆయన మావోయిస్టు పార్టీకి విజ్ఞప్తి చేశాడు.