అలా చేస్తే బార్‌ కౌన్సిల్‌ నుంచి గెంటేస్తాం

మీడియాలో తరచూ జడ్జీలపైనా, జడ్జిమెంట్లపైనా.. ఆ మాటకొస్తే లాయర్లపైనే పలువరు సీనియర్‌ లాయర్లు కామెంట్లు చేస్తున్నారు. కొందరు ప్రత్యేక వ్యాసాలు రాస్తున్నారు. మరికొందరు ప్రత్యేక ఉపన్యాసాలు ఇస్తున్నారు. దీంతో న్యాయవర్గాల పరువు కాపాడేందుకు బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా (బీసీఐ) ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి కోర్టులు, జడ్జీలు, జ్యుడిషియల్ అధికారి, రాష్ట్ర బార్ కౌన్సిల్‌, బీసీఐ, మరో లాయర్‌పైనా ఎవరైనా లాయర్లు ఉద్దేశపూర్వకంగా నిబంధనలనుకు విరుద్ధంగా, కేంద్ర, రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌కు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే అడ్వొకేట్స్‌ యాక్ట్‌ 1961లోని సెక్షన్‌ 35 లేదా 36 కింద చర్యలు తీసుకుంటామని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌, సోషల్‌ మీడియాలో లాయర్లు ఎలాంటి ప్రకటనలు చేయరాదని పేర్కొంది. బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా లేదా ఆయా రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ తీర్మానాలు, ఆదేశాలకు వ్యతిరేకంగా ప్రింట్‌ మీడియా, ఎలక్ట్రానిక్‌ మీడియా పత్రికా ప్రకటనలు ఇవ్వరాదని బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా పేర్కొంది. సవరించిన నిబంధనల మేరకు బార్‌ కౌన్సిల్‌ లేదా దాని ఆఫీస్‌ బేరర్లు, సభ్యులకు వ్యతిరేకంగా ఎలాంటి పరువు నష్టం కల్గించే ప్రకటనలు చేయరాదు. నిందాపూర్వక భాష మాట్లాడరాదు. నిబంధనలను ఎవరైనా ఉల్లంఘిస్తే బార్‌ కౌన్సిల్‌ సభ్యత్వం నుంచి సస్పెండ్‌ లేదా డిస్మిస్‌ చేస్తారు. అంటే ఆ తరవాత ఏ కోర్టులోనూ సదరు లాయర్‌ ప్రాక్టీస్‌ చేయడానికి వీలు ఉండదు. అలాంటివారు బార్‌ అసోసియేషన్లు లేదా బార్‌ కౌన్సిల్స్‌ ఎన్నికల్లో పోటీకి అనర్హులు. తన సభ్యుని ప్రవర్తనపై బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియాకు ఆయా రాష్ట్ర బార్‌ కౌన్సిల్స్‌ పరిశీలనకు పంపవచ్చు.