2023 డిసెంబర్ నుంచి అయోధ్యరాముడి దర్శనభాగ్యం

2025 చివ‌రిక‌ల్లా అయోధ్య రామ‌మందిరం పూర్తవుతుంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. రెండేండ్లు ముందుగా అంటే 2023, డిసెంబ‌ర్ నాటికి గ‌ర్భగుడి నిర్మాణం పూర్తవుతుంద‌ని, గ‌ర్భగుడి నిర్మాణం పూర్తయిన వెంట‌నే భ‌క్తుల‌కు ప్రవేశం క‌ల్పిస్తారని అయోధ్య రామాల‌య వ‌ర్గాలు వెల్లడించాయి. అంటే సార్వత్రిక ఎన్నికలు జరగడానికి కొన్ని నెలలు ముందు ఆలయ ద్వారాలు భక్తుల కోసం తెరుస్తారన్నమాట. భ‌క్తులు 2023 డిసెంబ‌ర్ నుంచి అయోధ్యలో పూజ‌లు చేయ‌వ‌చ్చని ఆలయ వర్గాలు తెలిపాయి. ట్రస్ట్‌ ఛైర్మన్ నృపేంద్ర మిశ్రా అధ్యక్షత‌న స‌మావేశ‌మైన శ్రీ రామ జ‌న్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఈ మేర‌కు నిర్ణయం తీసుకున్నట్లు విశ్వస‌నీయ వ‌ర్గాలు తెలిపాయి.

గ్రౌండ్ ఫ్లోర్ లోని 5 మండపాలు , గర్భగుడి నిర్మాణపనులు.. 2023 డిసెంబర్ నాటిికి పూర్తవుతాయి.ఆ తర్వాతే మొదటి అంతస్థుకు శంకుస్థాపన చేయనున్నట్లు ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు, గ్రౌండ్ ఫ్లోర్ పూర్తయిన తర్వాత గర్భగుడిలో.. రామ్ లాలా విగ్రహాలను ప్రతిష్టించనున్నట్లు వివరించారు
.
2020 ఆగస్టు 5న ప్రధాని నరేంద్రమోడీ.. రామమందిర నిర్మాణానికి భూమిపూజ చేశారు.దాదాపు వందెకరాల్లో ఈ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. దీనికోసం దేశవ్యాప్తంగా విరాళాలు సైతం సేకరించారు.