తప్పుడు పత్రాలు సృష్టించిన వసంత ప్రాజెక్ట్స్‌

జగన్‌ అక్రమాస్తుల కేసులో ఇందూ- గృహనిర్మాణ మండలి కేసుపై శుక్రవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ వసంత్‌ ప్రాజెక్ట్స్‌ కంపెనీ, ఆ సంస్థ అధినేత అయిన ఏపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై శుక్రవారం జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్‌ విచారణ చేపట్టారు. వసంత కృష్ణ ప్రసాద్‌ పిటీషన్‌ను వ్యతిరేకిస్తూ సీబీఐ తరఫు న్యాయవాది కె.సురేందర్‌ వాదనలు వినిపించారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలో ప్రాజెక్టును చేపట్టడానికి ఏర్పాటు చేసిన వసంత ప్రాజెక్ట్స్‌లో వాటాలను ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి అప్పటి ముఖ్యమంత్రి వై.ఎస్‌. తోడల్లుడు వై.వి.సుబ్బారెడ్డికి బదలాయించారని.. ప్రతిఫలంగా కూకట్‌పల్లిలోని చిడ్కో (సైబరాబాద్‌ హైటెక్‌ ఇంటిగ్రేటెడ్‌ టౌన్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌)కు అదనంగా ఎలాంటి బిడ్‌ లేకుండా 15 ఎకరాలను నాటి ప్రభుత్వం నుంచి పొందారంటూ సీబీఐ హైకోర్టుకు నివేదించింది. గచ్చిబౌలిలో 4.29 ఎకరాల్లో నిర్మించిన విల్లాలను కృష్ణప్రసాద్‌, వై.వి.సుబ్బారెడ్డి తమ బంధువులకు కేటాయించుకుని లబ్ధి పొందారని కోర్టుకు తెలిపారు. ప్రాజెక్టును పొందడానికి.. కృష్ణప్రసాద్‌ ఒత్తిడితో తప్పుడు పత్రాలు సృష్టించినట్లు వసంత ప్రాజెక్ట్స్‌ ఛార్టెడ్‌ అకౌంటెంట్‌ వాంగ్మూలం ఇచ్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తెచ్చారు. లేపాక్షి నాలెడ్జ్‌ హబ్‌, ఇందూ టెక్‌జోన్‌, గృహనిర్మాణ మండలి ప్రాజెక్టులను ఇందూ శ్యాంప్రసాద్‌రెడ్డి పొందారని, ఇందుకు ప్రతిఫలంగా జగన్‌కు చెందిన కార్మెల్‌ ఏసియా హోల్డింగ్స్‌లో రూ.70 కోట్లు పెట్టుబడులు పెట్టారని సీబీఐ పేర్కొంది. 48 మంది సాక్షులు, 6 వేల పత్రాల ఆధారాలతో చార్జిషీటును దాఖలు చేశామని పేర్కొన్నారు. నిబంధనల ప్రకారం ప్రాజెక్టులను పూర్తి చేయలేదని.. ఎంఐజీ, ఎల్‌ఐజీ గృహాలను నిర్మించలేదని చెప్పారు. విచారణలో నేరం రుజువవుతుందని, అందువల్ల ఈ పిటిషన్‌ను కొట్టివేయాలని కోరారు. కృష్ణప్రసాద్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వినోద్‌ దేశ్‌పాండే వాదిస్తూ… జగన్‌ కంపెనీల్లో పెట్టుబడులతో ఎలాంటి సంబంధం లేదని, నిబంధనల ప్రకారం ప్రాజెక్టు పూర్తి చేశామంటూ రాతపూర్వక వాదనలు సమర్పించారు.