అయోమయంలో వెంకట్‌రెడ్డి?

పోయింది ఎమ్మెల్యే సీటు మాత్రమే. కాని రూ. 18000 కోట్ల ప్రాజెక్టు వచ్చిందని కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి అనుకుంటుంటే… సోదరుడు కోమటి రెడ్డి వెంకట రెడ్డి పరిస్థితి గందరగోళంగా మారింది. తమ్ముడు ఓడినా.. టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇచ్చాడు. మరి తన పరిస్థితి ఏమిటని అయోమయంలో పడ్డారు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తమ్ముడితోపాటు పార్టీ మారడమా? లేదా కాంగ్రెస్‌లోనే ఉండటమా? అనేది తేల్చుకోలేకపోతున్నారు. అయితే రాష్ట్ర కాంగ్రెస్‌లో ఏమోగాని.. ఢిల్లీలో మాత్రం వెంకటరెడ్డికి మునుపుటి గౌరవం దక్కదని తేలిపోయింది. తన తమ్ముడిని గెలిపించాలంటూ ఫోను ద్వారా పలువురు నేతలతో మాట్లాడిన ఆడియోలు బయటపడటంపై హైకమాండ్‌ కూడా సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. తమ్ముడు బీజేపీలో చేరినా.. కనీసం పార్టీ అభ్యర్థి తరఫున వెంకటరెడ్డి ప్రచారంలో పాల్గొంటారని హైకమాండ్‌ భావించింది. అలాకాకుండా వెంకటరెడ్డి ఆస్ట్రేలియా వెళ్లిపోయారు. విదేశాల నుంచి వచ్చిన తరవాత కూడా కనీసం రాహుల్‌ పాద యాత్రలో పాల్గొన లేదు. దీంతో రాష్ట్రంలో…ఢిల్లీ కాంగ్రెస్‌లో కూడా వెంకటరెడ్డి ఒంటరి అయిపోయారు. తమ్ముడు గెలిస్తే.. వెంకటరెడ్డి కూడా బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. కాని తమ్ముడు ఓడిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్‌లో ఎవరూ నమ్మని పరిస్థితి.. అలా అని వేరే పార్టీలోకి వెళ్లలేని దుస్థితి. ఉన్న ఎంపీ సీటును వొదిలేస్తే… స్థానికంగా ప్రొటోకాల్‌ కూడా దొరకదు. ఎందుకంటే పార్టీ మారితే… ఉన్న సీటుకు రాజీనామా చేయడం మా సంప్రదాయమని బీజేపీ పదే పదే అంటోంది. అంటే ఎంపీ సీటుకు రాజీనామా చేయాలి. ప్రస్తుత పరిస్థితిలో చాలా రిస్క్‌తో కూడుకున్న వ్యవహారం. ఎందుకంటే ఒక్క ఎమ్మెల్యే సీటు కోసం వందల కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఎంపీ సీటు ఖర్చు భరించడం సాధ్యామా? మరోవైపు బొగ్గు గనిపై కాంగ్రెస్‌ పార్టీ నేతలు కోర్టుకు వెళతారనే ప్రచారం ఉంది. కాంట్రాక్ట్‌ రద్దు కాకున్నా… కోర్టు కేసులతో సాధ్యమైనంత వరకు ఆ ప్రాజెక్టును పెండింగ్‌లో ఉంచి… ఆర్థికంగా కోమటి రెడ్డి బ్రదర్స్‌ను దెబ్బతీయాలని కూడా కాంగ్రెస్‌లోని ఓ వర్గం ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలా జరిగే పక్షంలో…వచ్చే ఎన్నికల వరకు రాజకీయంగా, ఆర్థికంగా తట్టుకుని ఉండటం కోమటి రెడ్డి సోదరులకు కష్టమే. మరి ఈలోగా టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌తో పాటు బీజేపీలో కూడా ఎలాంటి మార్పులు వస్తాయో చూడాలి.