వివేకా కుటుంబంపై సంచలన వ్యాఖ్యలు

వైఎస్ కుటుంబం నాశనం కోరుకునేవారు వివేకా ఫ్యామిలీలో ఉన్నారని మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం రాత్రి ఆయన సీఎం క్యాంపు కార్యాలయం వద్ద మీడియాతో మాట్లాడుతూ.. ‘వివేకానందరెడ్డి బతికున్నా, చనిపోయినా జగన్‌.. కడప ఎంపీ సీటును అవినాష్‌ రెడ్డికే ఇచ్చేవారు. ఎందుకంటే కాంగ్రెస్‌కు రాజీనామా చేసి కడప ఎంపీగా జగన్‌, పులివెందుల ఎమ్మెల్యే అభ్యర్థిగా విజయమ్మ పోటీ చేస్తే వివేకానంద రెడ్డి ఆయన కుటుంబం జగన్‌ ప్రత్యర్థి పార్టీ తరపున నిలిచి వారిని ఓడించడానికి, సర్వనాశనం చేయడానికి ప్రయత్నించారు. అవినాష్‌ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి వైసీపీ ఆవిర్భావం నుంచి జగన్‌ వెన్నంటి ఉండి ఆయన విజయం కోసం పాటుపడ్డారు. వారికే జగన్‌ సీటిస్తారు. అది జగన్‌ ఇష్టం’ అని వ్యాఖ్యానించారు. జగన్ వైసీపీ స్థాపించాడని, అప్పుడు విజయమ్మపై కాంగ్రెస్ అభ్యర్థిగా వివేకా పోటీ చేశారని కొడాలి నాని వెల్లడించారు. అయితే అప్పట్లో విజయమ్మను ఓడించడానికి వివేకా కుటుంబం ప్రయత్నించిందని అన్నారు. వివేకా మృతి వల్ల వైసీపీకి లాభించింది ఏమీ లేదని స్పష్టం చేశారు. వివేకా మృతి సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే సీబీఐ విచారణ కోరామని పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక నిష్పక్షపాతంగా విచారణ చేస్తామని చెప్పామని వివరించారు.

Related Articles