తెలంగాణ నూతన సచివాలయ భవనాన్ని చివరకు అందరి అభీష్టం మేరకు అంబేడ్కర్ జయంతి రోజే ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఏప్రిల్ 14 ముహూర్తాన్ని ఖరారు చేశారు. అంతకుముందు ఫిబ్రవరి 17న కేసీఆర్ పుట్టినరోజు నాడు సచివాలయాన్ని ప్రారంభించాలని నిర్ణయించి, అందుకు ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు. ఇంతలో శాసనమండలి సభ్యుల ఎన్నికలకు షెడ్యూల్ రావడంతో ఎన్నికల కోడ్ అడ్డు వచ్చింది. దాంతో ఫిబ్రవరి 17 ముహూర్తం ఆగిపోయింది. తదుపరి ముహూర్తంపై సర్కారు ఆలోచనలో పడింది. అంబేడ్కర్ పేరుతో నిర్మిస్తున్న సచివాలయాన్ని ఆయన జయంతి రోజే ప్రారంభించాలని గతం నుంచీ డిమాండ్లు ఉన్నాయి. ఇదే అంశంపై హైకోర్టులో పిటిషన్లు దాఖలవడంతో పాటు కొంత చర్చ కూడా నడిచింది. ఎలాగూ వాయిదా వేశాం కనుక… ఇక అంబేద్కర్ జయంతి రోజునే ప్రారంభిస్తే మేలన్న నిర్ణయానికి రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. అందుకే ఏప్రిల్ 14న ఉదయం సచివాలయ ప్రారంభానికి ముహూర్తాన్ని ఖరారుచేసి, ఏర్పాట్లు చేయాలని అంతర్గతంగా నిర్ణయించినట్టు విశ్వసనీయంగా తెలుస్తోంది. సచివాలయ ప్రారంభానికి తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరేన్లతో పాటు బీహార్ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్, జేడీయూ జాతీయ నేత అలన్సింగ్తో పాటు, అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్ను ప్రభుత్వం ఆహ్వానించింది. ముహూర్తాన్ని ఏప్రిల్కు మార్చిన నేపథ్యంలో మరోసారి వీరందరికీ ఆహ్వానాలు పంపాలని నిర్ణయించారు.