పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో మంత్రి అంబటి రాంబాబుకు చేదు అనుభవం ఎదురైంది. గడప గడపకు కార్యక్రమంలో భాగంగా మంత్రి పసుపులేటి సీతమ్మ అనే వృద్దురాలి ఇంటికి వెళ్లారు. ఎప్పట్నుంచో వస్తున్న పింఛనును ఆపేశారని ఆమె మంత్రి వద్ద వాపోయారు. దానిపై మంత్రి సచివాలయ ఉద్యోగుల్ని ఆరా తీశారు. సీతమకమ కుటుంబసభ్యుల్లో ఒకరికి కారు ఉండటంతో రద్దు అయినట్లు వారు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో తీసుకునే నిర్ణయంలో పింఛను పునరుద్ధరణ అయ్యే అవకాశం ఉందని మంత్రి సర్ది చెబుతుండగా సీతమ్మ కుమారుడు వెంకటేశ్వర్లు వచ్చి అదే అంశంపై ప్రశ్నించబోయారు. ‘మంత్రి అయితే ఎవరికి గొప్ప, మా తమ్ముడు కారు తిప్పితే అమ్మ పింఛను ఎలా తొలగిస్తారంటూ’ ప్రశ్నించారు. ఈ క్రమంలో మంత్రి రాంబాబు, వెంకటేశ్వర్లు మధ్య వాగ్వాదం జరుగుతుండగా పోలీసులు వెంకటేశ్వర్లును అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చారు.