గుజరాత్ అల్లర్లకు మోడీయే బాధ్యుడంటూ బీబీసీ ప్రసారం చేసిన డాక్యుమెంటరీపై కొద్ది వారాలుగా తీవ్ర ఆగ్రహంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం బ్రిటన్ మీడియా సంస్థకు తన అధికారాన్ని చవిచూపిస్తోంది. ఆదాయ పన్ను ఎగవేతకు పాల్పడిందని ఆరోపిస్తూ మంగళవారం ఆ సంస్థ కార్యాలయాల్లో సోదాలు జరిపింది. ఢిల్లీ, ముంబై నగరాల్లో ఉన్న బీబీసీ ఆఫీసుల్లో ఇవాళ కూడా ఐటీశాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. మంగళవారం రాత్రంతా సోదాలు చేసిన అధికారులు.. వరుసగా రెండో రోజూ కూడా తనిఖీలు చేపడుతున్నారు. మరో వైపు బీబీసీ సంస్థ ఉద్యోగులకు ఈమెయిల్ చేసింది. ఉద్యోగులు ఇంటి నుంచి పనిచేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఐటీశాఖ అధికారులు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలని ఉద్యోగులకు సూచన చేసింది. వ్యక్తిగత ఆదాయం అంశాలపై ఉద్యోగులు సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదని కూడా బీబీసీ తన మెయిల్‌లో స్పష్టం చేసింది. ఐటీ అధికారులు సమగ్రమైన రీతిలో సమాధానం ఇవ్వాలని బీబీసీ తన ఉద్యోగులకు తెలిపింది.