ఆంధ్రప్రదేశ్‌లో మూడు రాజధానులపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ చెప్పినట్లు త్వరలోనే విశాఖపట్నం నుంచి పరిపాలన జరుగుతుందన్నారు. శ్రీశైలంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ విభజన సమయంలో రెవెన్యూ లోటు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమన్నారు. రాష్ట్రంలో ఉద్యోగుల జీతాలు ఒకటి, రెండు రోజులు ఆలస్యం కావడం కొత్తేమీ కాదని.. గతంలోనూ జరిగాయని తెలిపారు. ఇక, తెలంగాణ విషయం వచ్చినప్పుడు కూడా శ్రీకృష్ణ కమిటీ వికేంద్రీకరణకు మొగ్గు చూపిందని బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేర్కొన్నారు. అలాగే, శివరామకృష్ణ కమిటీ కూడా వికేంద్రీకరణ మంచిదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రం త్వరగా అభివృద్ధి కావాలంటే విశాఖపట్నంలోనే రాజధానిని ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. అలాగే, రాయలసీమ అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. శ్రీబాగ్ ఒప్పందాన్ని పరిగణలోకి తీసుకొని హైకోర్టును, వివిధ న్యాయ ట్రిబ్యునల్స్, కమిషన్లను కర్నూలులో ఏర్పాటు చేస్తామన్నారు. బెంగళూరు సమావేశంలో కూడా విశాఖపట్నంలో రాజధాని ఏర్పాటు కాబోతుందని చెప్పామని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. దేశంలోని 8 రాష్ట్రాల్లో కోర్టు ఒక చోట, రాజధాని మరొక చోట ఉందని గుర్తు చేశారు.