జేఈఈ మెయిన్ -2 పరీక్షలను ఏప్రిల్ 6, 8, 10, 11, 12 తేదీల్లో నిర్వహించనున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) తెలిపింది. అయితే, పరీక్షల నిర్వహణలో ఒకవేళ సాంకేతిక సమస్యలు ఉత్పన్నమైతే వినియోగించుకొనేందుకు ఏప్రిల్ 13, 15ను రిజర్వ్ తేదీలుగా ప్రకటించింది. బుధవారం నుంచే ప్రారంభమైన దరఖాస్తు నమోదుకు మార్చి 12 రాత్రి 9 గంటల వరకు గడువు ఇచ్చారు. గత షెడ్యూల్ ప్రకారం మార్చి 7 వరకే దరఖాస్తుకు చాన్స్ ఉండగా, తాజాగా మార్చి 12కు పొడిగించారు. కాగా, జేఈఈ మెయిన్ -1ను జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించి, ఇటీవలే ఫలితాలను ప్రకటించిన విషయం తెలిసిందే. జేఈఈ మెయిన్-1కు హాజరైన వారు కూడా మెయిన్ -2కు దరఖాస్తు చేసుకోవచ్చు. వివరాలకు https ://jeemain.nta.nic.in లేదా 011-40759000, 011-69227700 నంబర్లను సంప్రదించాలని ఎన్టీఏ పరీక్షల విభాగం డైరెక్టర్ సాధన పుష్కర్ వెల్లడించారు.