తెలంగాణ డీహెచ్ (డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్) శ్రీనివాసరావు మరో వివాదంలో చిక్కుకున్నారు. ఫిబ్రవరి 17న తెలంగాణ సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా మెడికల్, హెల్త్ ఆఫీసర్లకు అసాధారణ ఆదేశాలు జారీ చేశారు. కేసీఆర్ జన్మదినం సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రైమరీ హెల్త్ సెంటర్లు, సబ్సెంటర్లు సహా అన్నీ వైద్యసదుపాయాల వద్ద మొక్కలు నాటడంతోపాటు రోగులకు పండ్లు పంచిపెట్టాలని ఆదేశించారు. ఈ మేరకు సమాచారం అందిస్తూ రాష్ట్రంలోని అన్ని డిస్ట్రిక్ట్ మెడికల్, హెల్త్ ఆఫీసర్లకు ఆయన గురువారం ఒక సర్క్యూలర్ జారీ చేశారు. ఈ కార్యక్రమాలన్నింటినీ చేపట్టాలని అధికారులను కోరారు. డీహెచ్ శ్రీనివాసరావు జారీ చేసిన ఈ ఆదేశాలపై ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ముఖ్యమంత్రి పుట్టినరోజుకు కొత్తగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ మెప్పు పొందేందుకే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శిస్తున్నారు.