సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌లో కంది పంటకు రికార్డు స్థాయిలో ధరలు పలుకుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువ రేటుకు పంట అమ్ముడుపోతుండటంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సూర్యాపేట మార్కెట్‌లో శుక్రవారం కింటా కందులకు గరిష్ఠంగా రూ.7,755 ధర వచ్చింది. కొద్దిరోజులుగా కంది పంట మద్దతు ధర రూ.6,600 దాటి అదనంగా మరో రూ.1,000కి పైగా పలుకుతోంది. ఈనెల 11న సూర్యాపేట మార్కెట్‌లో క్వింటా కందులు రూ.7,344కు అమ్ముడుపోయాయి. 13న తిరుమలగిరిలో రూ.7,559 ధర వచ్చింది. కంది సాగు విస్తీర్ణం తగ్గడమే ధరలు పెరగడానికి కారణమని తెలుస్తోంది. కాగా, వేరుశనగ పంటకు మద్దతు ధర రూ.5,850 ఉండగా, సూర్యాపేట మార్కెట్‌లో గరిష్ఠంగా రూ.8,089 ధర పలికింది.