సికింద్రాబాద్- తిరుపతి వందేభారత్ రైలును నల్లగొండ మీదుగానే నడుపాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. ముందుగా మూడు మార్గాలను అధ్యయనం చేశారు. బీబీనగర్, కాజీపేట, విజయవాడ మార్గం కన్నా, ప్రస్తుతం నారాయణాద్రి రైలు వెళ్లే మార్గంలోనే నడిపేందుకు మొగ్గు చూపినట్టు తెలిసింది. దీంతో సికింద్రాబాద్, బీబీనగర్, నల్లగొండ, గుంటూరు, తెనాలి, నెల్లూరు గూడూరు, శ్రీకాళహస్తి మీదుగా రైలు తిరుపతికి వెళ్లనున్నది. ఇదే మార్గంలో పిడుగురాళ్ల నుంచి శావల్యాపురం మీదుగా ఒంగోలు, నెల్లూరు. గూడూరు, కాళహస్తి మీదుగా సర్వే చేశారు. ముందుగా నారాయణాద్రి మార్గంలో పిడుగురాళ్ల వరకు నడిపి, అక్కడి నుంచి శావల్యాపురం వైపు మళ్లించే యోచన చేస్తున్నారు. ఈ వారంలోనే రూట్‌కు సంబంధించి అధికారిక నిర్ణయం ప్రకటించనున్నారు. ఈ నెలాఖరున రైలును ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తున్నది. ప్రస్తుతం సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఇతర రైళ్లలో దాదాపు 12 గంటల సమయం పడుతున్నది. వందేభారత్ అందుబాటులోకి రావడం ద్వారా ఆరు నుంచి ఏడు గంటల సమయంలో గమ్యస్థానానికి చేరుకొనే అవకాశం కలుగుతుంది. గంటకు 130 నుంచి 150 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే విధంగా ట్రాక్‌ల పటిష్ఠతను పరిశీలిస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి తిరుపతికి రూ.1150 కనీస టికెట్ ధర ఉండే అవకాశముంది.