భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కెరీర్ చివరి మ్యాచ్‌లో పరాజయం పాలైంది. దుబాయ్ ఈవెంట్‌తో కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టనున్నట్లు ప్రకటించిన ఈ హైదరాబాదీ.. మంగళవారం జరిగిన తొలి రౌండ్లో ఓడింది. మహిళల డబుల్స్ మొదటి రౌండ్లో సానియా మీర్జా-మాడిసన్ కీస్ (అమెరికా) ద్వయం 4-6, 0-6తో వెరోనికా-లుడామిలా (రష్యా) జంట చేతిలో ఓటమి పాలైంది. తొలి సెట్లో ఒక దశలో 4-4తో చక్కటి ప్రదర్శన కనబర్చిన సానియా జోడీ ఆ తర్వాత అదే జోరు కొనసాగించలేకపోయింది. 2003లో ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించిన సానియా.. 43 డబ్ల్యూటీఏ డబుల్స్ టైటిల్స్ ఖాతాలో వేసుకుంది. రెండు దశాబ్దాలపాటు కెరీర్ కొనసాగించిన సానియా.. 6 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ చేజిక్కించుకుంది. ఇందులో మూడు మహిళల డబుల్స్ కాగా.. మరో మూడు మిక్స్డ్ డబుల్స్ టైటిల్స్ ఉన్నాయి. ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్, ఆఫ్రోఆసియా గేమ్స్ ఇలా అన్నింట్లోనూ మెడల్స్ చేజిక్కించుకున్న 36 ఏండ్ల సానియా.. ఈ ఏడాది ఆస్ట్రేలియా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ రన్నరప్‌గా నిలిచింది. తొలిసారి గ్రాండ్‌స్లామ్ టైటిల్ నెగ్గిన మెల్‌బోర్న్‌లోనే గ్రాండ్‌స్లామ్ కెరీర్‌కు ఫుల్స్టాప్ పెట్టిన సానియా.. తాజా పరాజయంతో ప్రొఫెషనల్ టెన్నిస్‌కు దూరమైంది. ఇప్పటి వరకు కెరీర్లో లెక్కకు మిక్కిలి టైటిల్స్ సాధించిన సానియా మీర్జా.. ఆటతో పాటు ఆటేతర విషయాలతోనూ తరచూ వార్తల్లో నిలిచింది. సంప్రదాయ ముస్లిం కుటుంబం నుంచి వచ్చి ప్రొఫెషనల్ టెన్నిస్ ఆడేందుకు ఎన్నో అడ్డంకులు ఎదుర్కొన్న సానియా.. పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్‌ను పెళ్లాడి అంతకుమించిన విమర్శలు ఎదుర్కొంది. అయినా.. దేనికి భయపడని ఆమె మనస్తత్వమే సానియాను ఈ స్థాయికి చేర్చింది.