పట్టాభిపై థర్డ్‌ డిగ్రీ!

‘ముసుగులు ధరించిన వ్యక్తులు.. నా ముఖానికి టవల్ చుట్టేసి అర గంటపాటు తీవ్రంగా కొట్టారు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి చిత్రహింసలకు గురిచేశారు’ అని టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్ న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు. వైద్య పరీక్షలకు ఆదేశించిన న్యాయమూర్తి.. ఆయనకు 14 రోజులపాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌ విధించారు. కరుడుగట్టిన నేరస్థుల విషయంలోనూ ప్రవర్తించని విధంగా పోలీసులు తమ ప్రతాపాన్ని పట్టాభిపై చూపారు. అరెస్టు చేసే విషయంలో నిబంధనలకు తూట్లు పొడిచారు. సోమవారం సాయంత్రం 6 గంటల సమయంలో గన్నవరంలో ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చూపితే వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం ఇవ్వాల్సి ఉంటుందని.. అనధికారికంగా ఆయన కారులోనే తీసుకెళ్లారు. డ్రైవర్‌ను, పీఏను, ప్రైవేటు భద్రతాసిబ్బందిని పక్కకునెట్టేశారు. కారుకు ముందు, వెనుక నాలుగైదు వాహనాలను పెట్టి గన్నవరం నుంచి తరలించారు. ఎక్కడకు తీసుకెళ్తున్నారో చెప్పకుండా అత్యంత రహస్యంగా ఉంచారు. సమాచారం ఎక్కడా లీక్‌ అవ్వకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రాత్రంతా ఒకచోట నుంచి మరోచోటకు తిప్పారు. గన్నవరం నుంచి తొలుత తోట్లవల్లూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. అక్కడి నుంచి గుడివాడ పోలీసు స్టేషన్‌కు, తర్వాత గుడ్లవల్లేరు స్టేషన్‌కు తీసుకెళ్లారు. జీపులో ఎవరు ఉన్నారో కనిపించకుండా బ్లాక్‌ఫిలిం విండో అద్దాలు దించారు. ప్రతి స్టేషన్‌ వద్ద మూడు, నాలుగు నిమిషాలు వాహనాలను ఆపారు. స్టేషన్లో ఎంతమంది సిబ్బంది సెంట్రీగా ఉన్నారు.. చుట్టుపక్కల పరిస్థితులేమిటో చూసుకున్నారు. చివరకు గుడ్లవల్లేరు పీఎస్‌ వద్ద పట్టాభిని ఎక్కువ సేపు ఉంచినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో స్టేషన్లో విద్యుద్దీపాలు ఆర్పివేశారు. పట్టాభి ముఖానికి ముసుగు వేసి ముగ్గురు వ్యక్తులు లాఠీలతో కొట్టినట్లు సమాచారం. గుడ్లవల్లేరు నుంచి మంగళవారం తెల్లవారుజామున పట్టాభిని తిరిగి గన్నవరం స్టేషన్‌కు తీసుకొచ్చారు. ఇక్కడే ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు. సాయంత్రం 4 గంటలకు భారీ బందోబస్తు మధ్య గన్నవరం జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టుకు తీసుకెళ్లారు.