ఉక్రెయిన్‌పై రష్యా ఎప్పటికీ గెలవలేదు

అమెరికా సహా మిత్రదేశాలు ఉక్రెయిన్‌ వెన్నంటే ఉంటాయని అగ్రరాజ్యం అధ్యక్షుడు జో బైడెన్ స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా ఎప్పటికీ విజయం సాధించలేదని ఆయన తెలిపారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్దానికి ఏడాది పూర్తయిన సందర్భంగా బైడెన్ ఈ మేరకు వ్యాఖ్యానించారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనే పాశ్చాత్య సంకల్పాన్ని ఈ యుద్ధం కఠినతరం చేసిందని బైడెన్ అన్నారు. పోలాలండ్ వార్సాలోని ప్రఖ్యాత రాయల్ క్యాసినో వేదికగా పౌరులు, ఉక్రెయిన్ శరణార్ధులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ప్రపంచంలోని ప్రజాస్వామ్యాలు నేటికి, రేపటికి, ఎప్పటికీ స్వేచ్ఛకు రక్షణగా నిలుస్తాయని బైడెన్ తెలిపారు. కీవ్‌లో ఆకస్మికంగా పర్యటించిన ఆయన ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీతో భేటీ అయిన మరుసటి రోజే బైడెన్ ఈ వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు కీవ్ బలంగా, గర్వంగా ఉందని బైడెన్ పేర్కొన్నారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఐరోపాలో అతిపెద్ద యుద్ధం ఉక్రెయిన్‌లో ప్రారంభమైందని అన్నారు. ఇప్పటికే ఈ యుద్ధంలో పదివేల మందికి పైగా మృతి చెందారని బైడెన్ తెలిపారు.