అదానీకి కాపలా కుక్కగా ఈడీ

దేశ ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేస్తూ, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రమాదంలోకి నెడుతున్న అదానీపై కేసులు పెట్టకుండా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌, సెబీ, సీబీఐ వంటి కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు కాపలా కుకలుగా పని చేస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కే నారాయణ విమర్శించారు. అదానీ వ్యవహారంపై ప్రపంచమంతా సీరియస్‌ అయితే, ప్రధాని మోదీ, అమిత్‌షా మాత్రం అదానీకి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్ల నోళ్లు మూయిస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 25 నుంచి 27 వరకు పుదుచ్చేరిలో జరిగే సీపీఐ జాతీయ సమితి సమావేశాల్లో దేశంలోని రాజకీయ పరిస్థితులు, ఎన్నికలపై చర్చిస్తామని వెల్లడించారు.
హైదరాబాద్‌లోని మగ్దూంభవన్‌లో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీని బలంగా వ్యతిరేకిస్తున్న పార్టీగా బీఆర్‌ఎస్‌ను పరిగణిస్తున్నామని చెప్పారు. ఖమ్మంలో కమ్యూనిస్టులు, రేవంత్‌రెడ్డి చెట్టాపట్టలేసుకొని తిరుగుతున్నారని, బీఆర్‌ఎస్‌కు రాంరాం చెప్పేశారని సోషల్‌ మీడియాలో ఫొటోలు పెట్టి, రెండు పార్టీలు కలిసిపోతున్నాయని వైరల్‌ చేశారని, అవన్నీ కట్టుకథలే తప్ప.. వాస్తవం కాదని స్పష్టంచేశారు.