ఎంసెట్‌లో ఇంటర్ మార్కుల వెయిటేజీని రద్దు చేస్తూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది కూడా ఎంసెట్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు కల్పించాలని నిర్ణయించింది. ఇంటర్లో కనీస మార్కులు సాధించాలన్న నిబంధనను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు వెల్లడించింది. దీంతో ఇంటర్లో జనరల్ విద్యార్థులు 45 శాతం, రిజర్వ్డ్ క్యాటగిరీ విద్యార్థులు 40 శాతం మార్కులు సాధిస్తేనే ఎంసెట్‌కు హాజరుకావొచ్చని సూచించింది. కరోనా ప్రభావం కారణంగా మూడేండ్లుగా ఎంసెట్‌లో ఇంటర్ వెయిటేజీ నుంచి మినహాయింపు ఇచ్చారు. తాజాగా ఈ విద్యాసంవత్సరం ఇంటర్ వెయిటేజీ అంశంపై ఉన్నత విద్యామండలి అధికారులు నిపుణుల కమిటీ వేశారు. ఈ కమిటీ… జేఈఈ సహా ఇతర రాష్ర్టాలను అనుసరిస్తూ ఈ ఏడాది కూడా వెయిటేజీ నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడంతో శుక్రవారం ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.