కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియాగాంధీ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నట్లు తెలిపారు. తన ఇన్నింగ్స్ భారత్ జోడో యాత్రతో ముగిసినందుకు సంతోషంగా ఉందన్నారు. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో మూడు రోజుల పాటు నిర్వహిస్తున్న పార్టీ 85వ ప్లీనరీలో రెండవ రోజైన శనివారం ఆమె ప్రసంగిస్తూ… ‘భారత్ జోడో యాత్రతో నా ఇన్నింగ్స్ ముగుస్తుండటం చాలా సంతోషం కలిగిస్తోంది. దేశాన్ని ఒక మలుపు తిప్పిన యాత్ర ఇది. సామరస్యం, సహనం, సమానత్వాన్ని దేశ ప్రజలంతా కోరుకుంటున్నారని ఈ యాత్ర రుజువు చేసింది’ అని అన్నారు. డాక్టర్ మన్మోహన్ సింగ్ నాయకత్వంలో 2004, 2009లో సాధించిన విజయాలు తనకెంతో సంతప్తినిచ్చాయని, కాంగ్రెస్ పార్టీని మలుపుతిప్పిన భారత్ జోడో యాత్రతో ఇన్నింగ్స్ ముగించాలనుకోవడం సంతోషాన్నిస్తోందని సోనియాగాంధీ చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి, యావద్దేశానికి కూడా ఇది సవాలు వంటి సమయమని, దేశంలోని ప్రతి వ్యవస్థనూ బీజేపీ- ఆర్ఎస్ఎస్ తమ అధీనంలోకి తీసుకుని చిన్నాభిన్నం చేస్తున్న తరుణమని ఆరోపించారు. కొద్దిమంది వ్యాపారవేత్తలకు అనుకూలంగా వ్యవహరించడం దేశ ఆర్థిక పతనానికి కారణమవుతోందని అన్నారు. కాంగ్రెస్ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదని, అన్ని మతాలు, కులాలు, జెండర్ ప్రజల వాణిని ప్రతిబింబిస్తుందని, అందరి కలలను సాకారం చేస్తుందని అన్నారు. ప్రధానమంత్రి మోదీ, బీజేపీ ఈ దేశంలోని అన్ని వ్యవస్థలను తమ అధీనంలోకి తీసుకుంటున్నాయని ఆరోపించారు. బీజేపీ విదేశ్వాగ్ని రగులుస్తోందని, మైనారిటీలు, మహిళలు, దళితులు, గిరిజనులను టార్గెట్ చేసుకుంటోందని అన్నారు. రాజ్యాంగ నిర్దేశిత విలువలను ప్రభుత్వ చర్యలు కాలరాస్తున్నాయని చెప్పారు. మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించే లక్ష్యంతో కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు.