ర్యాగింగ్ చేస్తే మెడికల్ సీటు రద్దు?

మెడిసిన్ స్టూడెంట్‌ ప్రీతి ఆత్మహత్య నేపథ్యంలో.. ర్యాగింగ్ విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. విద్యార్థులను ర్యాగింగ్‌ చేసినట్లు రుజువైతే ర్యాగింగ్‌ చేసిన సదరు విద్యార్థి మెడికల్‌ సీటును రద్దు చేసే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ విషయంపై తీవ్ర కసరత్తు చేస్తోంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ ర్యాగింగ్‌ను నిరోధించలేకపోతున్నారు. ఏదో రూపంలో సీనియర్ల నుంచి జూనియర్‌ మెడికోలు ర్యాగింగ్‌ను ఎదుర్కొంటున్నారు. ఇందుకు సంబంధించి ప్రిన్సిపాళ్లు, హెచ్‌వోడీలు హెచ్చరించినప్పటికీ సీనియర్లలో ఎలాంటి మార్పు రావడం లేదు. ఇలాంటి వారి విషయంలో కఠిన చర్యలు తీసుకుంటే తప్ప మార్పురాదని ప్రభుత్వం భావిస్తోంది. ఇటీవల గాంధీ మెడికల్‌ కాలేజీలో జూనియర్లను ర్యాగింగ్‌ చేసిన కొంత మంది సీనియర్లను మూడు నెలలపాటు సస్పెండ్‌ చేశారు. అయితే ఇలాంటి చిన్నచిన్న శిక్షలు చాలా తక్కువన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ర్యాగింగ్‌ చేస్తే సీటు పోతుందన్న భయం వారిలో ఉంటే తప్ప మార్పురాదని కొందరు సీనియర్‌ అధ్యాపకులు అభిప్రాయపడుతున్నారు.

Related Articles