సామాన్యుల నడ్డివిరిచేలా గృహావసర, వాణిజ్య వినియోగ సిలిండర్లపై కేంద్రం మోయలేని భారం మోపింది. అంతర్జాతీయ ధరలను సాకుగా చూపుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు డొమెస్టిక్ సిలిండర్ ధరను రూ.50 చొప్పున, వాణిజ్య సిలిండర్ ధరను రూ.350.5 చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. అదే సమయంలో విమాన ఇంధన (ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్) ధరలను 4 శాతం మేర తగ్గిస్తున్నట్టు ప్రకటించాయి. ఈ నిర్ణయాలు బుధవారం నుంచే అమల్లోకి వస్తున్నట్టు స్పష్టం చేశాయి. తాజా పెంపుతో 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర హైదరాబాద్‌లో రూ.1105 నుంచి రూ.1155కు చేరుకుంది. అలాగే, వాణిజ్య సిలిండర్ల ధర రూ.1973 నుంచి రూ.2325కు చేరింది.