కేబీఆర్ పార్క్‌లో నటికి చేదు అనుభవం

హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్‌లో సినీ నటికి చేదు అనుభవం ఎదురైంది. సాయంత్రం పూట వాకింగ్‌కు వచ్చిన ఆమెను ఓ వ్యక్తి వెంబడించి చుక్కలు చూపించాడు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్ట్ చేశారు. పోలీసుల సమాచారం ప్రకారం.. కొండాపూర్ బొటానికల్ గార్డెన్స్ సమీపంలో నివసించే ఈ నటి బుధవారం రాత్రి కేబీఆర్ పార్క్‌కు నడక కోసం వచ్చింది. రాత్రి ఏడు గంటల సమయంలో ఆమె పార్క్‌లో నడుస్తుండగా గుర్తు తెలియని యువకుడు ఆమెను ఫాలో అయ్యాడు. తను ఎక్కడ ఆగితే అక్కడ ఆగుతున్నాడు. నడిస్తే నడుస్తున్నాడని ఆమె గమనించింది. ఇలా దాదాపు ఐదు సార్లు పరీక్షించిన ఆమె వెంటనే అప్రమత్తమైంది. అక్కడ ఉన్న స్థానికులకు, పార్క్ సిబ్బందికి ఈ విషయం తెలియజేసింది. దీంతో అందరు కలిసి ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు సమాచారం అందించారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు వచ్చి అతడిని ప్రశ్నించగా.. తన పేరు శేఖర్ అని చెప్పుకొచ్చాడు. అయితే ఇదే నటికి గతంలోనూ కేబీఆర్ పార్క్‌లో ఇలాంటి అనుభవమే ఎదురైంది. 2021లో ఓ రోజు వాకింగ్ వచ్చిన ఆమెను ఓ అగంతకుడు వెంటాడి, లైంగిక దాడికి యత్నించాడు. అది కుదరకపోవడంతో బండరాయితో దాడి చేసి సెల్‌ఫోన్‌, పర్సు లాక్కెళ్లాడు. ఇప్పుడు తాజాగా అదే నటిని అగంతకుడు వెంటాడటం పలు అనుమానాలను రేకెత్తిస్తోంది.

Related Articles