పెళ్లి పత్రికలు పంచేందుకు హెలికాప్టర్ బుకింగ్‌

హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారి వినూత్నంగా ఆలోచించాడు. కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తూ.. తన తమ్ముడి పెళ్లి పత్రికలు పంచేందుకు ఏకంగా హెలికాప్టర్ బుక్ చేశాడు. హెలికాప్టర్‌లో వెళ్లి బంధువులు, స్నేహితులకు పెళ్లి పత్రికలు పంపిణీ చేశాడు. ఖైరతాబాద్‌కు చెందిన వ్యాపారి మధు యాదవ్ దూద్‌వాలా పేరుతో డైరీ ఫాం నిర్వహిస్తున్నాడు. ఈ నెల 9న అతడి తమ్ముడు చందు యాదవ్ పెళ్లి నిశ్చయం కాగా.. బంధువులకు పెళ్లి పత్రికలు పంపిణీ చేయటం ప్రారంభించాడు. నగరంలోని బంధుమిత్రులందరికీ స్వయంగా వెళ్లి పత్రికలు అందజేశాడు. అయితే మధు యాదవ్‌కు ముంబైలోనూ బంధువులు ఉన్నారు. వారికి కూడా స్వయంగా వెళ్లి తమ్ముడు పెళ్లి పత్రికలు అందజేయాలనుకున్నాడు. అందుకు వినూత్నంగా ఆలోచించాడు. విమానంలోనో, ట్రైన్‌లోనో వెళ్లకుండా పెళ్లి పత్రికలు పంచేందుకు ఏకంగా ఓ హెలికాప్టర్‌నే బుక్ చేశాడు. మంగళవారం హెలికాప్టర్‌లో ముంబైకి వెళ్లి బంధువులకు తమ్ముడి లగ్న పత్రికలు అందజేశాడు. వాట్సప్‌ మెసేజ్‌ల రూపంలోనో.. కొరియర్ ద్వారానో ఆహ్వాన పత్రికలు పంపిస్తున్న ఈ రోజుల్లో ఏకంగా హెలికాప్టర్ బుక్ చేసి తన తమ్ముడిపై ఉన్న ప్రేమను చాటుకున్నారు మధు యాదవ్. ఇక పెళ్లి పత్రకలే హెలికాప్టర్‌లో పంపిణీ చేస్తే.. పెళ్లికి ఏ రేంజ్‌లో ఏర్పాట్లు చేస్తాడోనని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.