భారత ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంబ్రిడ్జ్‌ యూనివర్సిటీలో ఉపన్యాసం సందర్భంగా భారత ప్రజాస్వామ్యంపై ప్రాథమిక నిర్మాణంపై దాడి జరుగుతోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో పెద్ద సంఖ్యలో రాజకీయ నేతల ఫోన్‌లలో పెగాసస్ స్పైవేర్ ఉందన్నారు. ఇజ్రాయిల్ స్పైవేర్ పెగాసస్ తన ఫోన్‌లోకి స్నూప్ చేయడానికి ఉపయోగించబడుతుందని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ అధికారులు తనకు కాల్ చేశారని ఫోన్‌లో మాట్లాడే విసయాలను తాము రికార్డు చేస్తున్నట్లు తనకు చెప్పినట్లు తెలిపారు. ఈ విషయమై తనను హెచ్చరించినట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం.. సెంట్రల్ ఏజెన్సీలను దుర్వినియోగం చేస్తోందన్నారు. కేవలం ప్రతిపక్షాలపై కేసులు పెడుతున్నారని తీవ్ర ఆరోపణలు చేవారు. తనపై కూడా అనేక అభియోగాలపై కేసులు నమోదు చేశారన్నారు. ప్రజాస్వామ్య నిర్మితమైన దేశంలో మీడియా, ప్రతిపక్షాలపై ఇలాంటి చర్యలు సరికాదన్నారు.