బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రమాదానికి గురయ్యాడు. హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రాజెక్ట్-K షూటింగ్‌లో అమితాబ్ గాయపడ్డాడు. యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అమితాబ్ ముంబైలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రాజెక్ట్-K సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరుగుతోంది. మార్చి 4న ఈ సినిమా షూటింగ్‌లో అమితాబ్ ప్రమాదానికి గురయ్యాడు. దీంతో అప్రమత్తమైన చిత్ర యూనిట్ హుటాహుటిన అమితాబ్‌ను గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి తరలించింది. ఈ ప్రమాదంలో అమితాబ్ పక్కటెముకలకు గాయాలయినట్లు తెలుస్తుంది. దాదాపు రెండు రోజులు పాటు అమితాబ్ ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నాడు. రెండు వారాల పాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించడంతో.. ఆదివారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అవ్వగానే ముంబై వెళ్లిపోయాడు. అక్కడే తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఈ విషయాన్ని అమితాబ్ బచ్చన్ స్వయంగా సోషల్ మీడియాలో చెప్పుకొచ్చాడు.