వేల మంది ఉద్యోగుల్ని తొల‌గించ‌నున్న మెటా

ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ సోష‌ల్ నెట్‌వ‌ర్క్ సైట్ల‌ ఓన‌ర్ మెటా ఫ్లాట్‌ఫామ్స్ కంపెనీ మ‌రోసారి ఉద్యోగుల తొల‌గింపున‌కు సిద్ధమైన‌ట్లు తెలుస్తోంది. వేల మందిపై వేటు వేసే ప్రక్రియ‌లో ఆ కంపెనీ ఉన్నట్లు తాజా స‌మాచారం ద్వారా వెల్ల‌డైంది. ఈ వారంలోనే ఆ లేఆఫ్స్‌కు సంబంధించిన వార్త వెలుబ‌డే ఛాన్సు ఉంద‌ని ఓ రిపోర్టు పేర్కొన్న‌ది. గ‌త ఏడాది న‌వంబ‌ర్‌లో ఆ కంపెనీ 13 శాతం మంది ఉద్యోగుల్ని తొల‌గించిన విష‌యం తెలిసిందే. అయితే తాజా రిపోర్టు ప్రకారం మ‌ళ్లీ భారీ స్థాయిలో ఉద్యోగుల కుదింపున‌కు ఆ సంస్థ స‌న్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తొలి ద‌శ‌లో సుమారు 11 వేల మంది ఉద్యోగుల్ని మెటా సంస్థ తొల‌గించిన విష‌యం తెలిసిందే. అయితే సంస్థలో ఫైనాన్షియ‌ల్ టార్గెట్లను అందుకునే ఉద్దేశంతో ఉద్యోగుల తొల‌గింపు ప్రక్రియ కొన‌సాగ‌నున్న‌ట్లు భావిస్తున్నారు. మేనేజ‌ర్లకు ప్యాకేజీలు ఇచ్చి వెళ్లగొట్టే ప్రయ‌త్నంలో ఉన్నారు. అవ‌స‌రం లేద‌నుకున్న బృందాల‌ను ఇంటికి పంపేయ‌నున్నారు. మెటాలో రెండో ద‌ఫా ఉద్యోగుల తొల‌గింపుపై ఫిబ్రవ‌రిలోనే బ్లూమ్‌బ‌ర్గ్ న్యూస్ సంస్థ ఓ క‌థ‌నాన్ని రాసింది. తాజా లేఆఫ్స్‌పై వ‌చ్చే వారంలోగా తుది నిర్ణయం బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశాలు ఉన్నాయ‌ని కంపెనీ వ‌ర్గాలు వెల్లడిస్తున్నాయి.