వినియోగదారులను ఆకర్షించేందుకు ఓ మొబైల్ షాపు యజమాని సరికొత్తగా ఆలోచించాడు. ఎవరూ ఊహించని విధంగా ఆఫర్ ప్రకటించి కటకటలాపాలయ్యాడు. స్మార్ట్ ఫోన్ కొంటే రెండు బీర్లు ఉచితంగా పొందొచ్చని ప్రకటించాడు. దీంతో జనాలు తండోపతండాలుగా ఆ షాపు వద్దకు తరలిరావడంతో.. పోలీసులు రంగ ప్రవేశం చేయాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళితే… ఉత్తరప్రదేశ్‌లోని భదోయి జిల్లా కొత్వాలి పోలీసు స్టేషన్ పరిధిలోని రాజేశ్ మౌర్య అనే వ్యక్తి చౌరీ రోడ్డులో మొబైల్ దుకాణం నిర్వహిస్తున్నాడు. అయితే తన షాపులో ఉన్న ఆండ్రాయిడ్ మొబైల్స్‌ను సేల్ చేసేందుకు సరికొత్త ఆఫర్ ప్రకటించాడు. ఒక స్మార్ట్ ఫోన్ కొంటే.. రెండు బీర్లు ఉచితంగా పొందొచ్చని పోస్టర్లు ప్రదర్శించాడు. ఈ ఆఫర్ కేవలం మార్చి 3 నుంచి 7వ తేదీ వరకు మాత్రమే అని రాజేశ్ మౌర్య పేర్కొన్నాడు. దీంతో స్మార్ట్ ఫోన్లను కొనేందుకు జనాలు ఎగబడ్డారు. జనాలు భారీగా తరలిరావడంతో.. పోలీసులు రంగ ప్రవేశం చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. జనాలను చెదరగొట్టి రాజేశ్ మౌర్యను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం మొబైల్ షాపును సీజ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.