ఆఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా మహిళల చదువు, ఉద్యోగాలపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. విద్యాసంస్థల మూసివేత మొదలు.. బహిరంగ ప్రదేశాల్లో ఒంటరిగా తిరగడంపై నిషేధం విధిస్తున్నారు. తాజాగా, మహిళల విడాకులను రద్దు చేసినట్లు సమాచారం. గృహహింసకు గురై భర్తలకు దూరంగా ఉంటున్న మహిళలను, తిరిగి వారి మాజీలతోనే కలిసుండాలని ఒత్తిడి తెస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడించాయి. అమెరికా బలగాల నీడలో స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్న అఫ్గన్ మహిళలకు తాలిబన్లు వచ్చిన తర్వాత అవన్నీ కాలగర్బంలో కలిసిపోయాయి. ముఖ్యంగా విడాకులు తీసుకున్న వారిపైనా తాలిబన్లు ఉక్కుపాదం మోపుతున్నారు. చట్టపరంగా గతంలో విడాకులు తీసుకున్న మహిళలను మాజీ భర్తతో కలిసి జీవించాలని తాలిబాన్ కమాండర్లు ఆదేశాలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. గృహహింసకు వ్యతిరేకంగా పోరాడటం, చట్టపరంగా విడాకులు తీసుకున్నప్పటికీ వారి నుంచి దూరంగా వెళ్లే అవకాశం లేకపోవడం వంటి సవాళ్లను అఫ్గన్ మహిళలు ఎదుర్కొంటున్నట్లు ఇటీవల ఐక్యరాజ్యసమితి కూడా ఆందోళన చెందింది.