బాపట్ల సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్యలో కొత్త ట్విస్ట్

బాపట్ల జిల్లాలోని వేమూరు- 2 సచివాలయ ఉద్యోగిని తోట సరళ ఆత్మహత్యలో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ఆత్మహత్యకు ముందు సరళ రాసిన సూసైడ్ లేఖ తాజాగా బయటపడింది. పనిఒత్తడి తాళలేక సరళ ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో రాసింది. దీంతో తల్లి లేకపోవడం, అనారోగ్య కారణాలతో ఆత్మహత్య చేసుకుందని భావించిన కుటుంబసభ్యులు ఈ లేఖతో కన్నీరుమున్నీరు అవుతున్నారు. కొల్లూరుకు చెందిన తోట సరళ వేమూరు – 2 సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహించారు. ఈ క్రమంలోనే గత నెల 24న సరళ బలవన్మరణానికి పాల్పడింది. అయితే సరళ ఆత్మహత్యకు అనారోగ్య కారణాలే కారణమని కుటుంబసభ్యులు, బంధువులు భావించారు. అయితే ఇప్పుడు సరళ రాసిన సుసైడ్ లేఖ బయటకు రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సచివాలయంలో పని ఒత్తిడి తట్టుకోలేకనే ఆత్మహత్య చేసుకున్నట్లు లేఖలో పేర్కొంది. ప్రస్తుతం ఈ లేఖ బయటకు రావడంతో తీవ్ర కలకలం రేగుతోంది. సరళతో పనిచేసిన తోటి ఉద్యోగులు సూసైడ్‌ లేఖను తీసుకుని స్థానికంగా ఉన్న ఎంపీడీవో, మండల స్థాయి అధికారులకు అందజేశారు. సరళ కుటుంబానికి అండగా ఉండాలని వినతి పత్రం అందజేశారు. అయితే పని ఒత్తిడికి గల కారణాలపై విచారణ చేపట్టాలని గ్రామస్తులు, కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు.