మ‌ళ్లీ మేమే అధికారంలోకి వ‌స్తాం..

వ్యాపారులు, పెట్టుబ‌డుల‌కు రాష్ట్రంలో అద్భుత‌మైన వాతావ‌ర‌ణం ఉంద‌ని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇటీవ‌ల బ‌యో ఏషియా స‌ద‌స్సు విజ‌య‌వంతంగా నిర్వహించుకున్నాం అని తెలిపారు. మ‌ళ్లీ మేమే అధికారంలోకి వ‌స్తాం.. మ‌రిన్ని సీఐఐ స‌ద‌స్సులు నిర్వహిస్తామ‌ని కేటీఆర్ స్పష్టం చేశారు. బేగంపేట‌లో ఏర్పాటు చేసిన సీఐఐ తెలంగాణ వార్షిక స‌మావేశానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజ‌రై ప్రసంగించారు. లైఫ్ సైన్సెస్ రంగంలో పెట్టుబ‌డుల‌కు విస్తృత అవ‌కాశాలు ఉన్నాయ‌ని కేటీఆర్ పేర్కొన్నారు. 2013తో పోలిస్తే రాష్ట్రంలో పెట్టుబ‌డులు రెట్టింపు అయ్యాయి. 2030 నాటికి 250 బిలియ‌న్ డాల‌ర్లు సాధించాల‌నే ల‌క్ష్యంతో ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. హైద‌రాబాద్ న‌గ‌రానికి ఎన్నో అనుకూల‌త‌లు, బ‌లాలు ఉన్నాయి. 9 బిలియ‌న్ టీకాలు హైద‌రాబాద్‌లోనే ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉత్పత్తయ్యే టీకాల్లో 50 శాతం హైద‌రాబాద్‌లోనే త‌యారు అవుతున్నాయ‌ని తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద స్టెంట్ త‌యారీ కేంద్రం మ‌న డివైజెస్ పార్కులోనే ఉంద‌న్నారు. తెలంగాణ‌లో అతి పెద్ద మొబిలిటీ వ్యాలీని ఏర్పాటు చేశాం. దేశానికే హైద‌రాబాద్ మొబిలిటీ కేంద్రంగా మారుతుంద‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు.