10 నుంచి విశాఖ వన్డే టికెట్ల విక్రయాలు

విశాఖపట్నంలోని ఏసీఏ-వీడీసీఏ స్టేడియంలో భారత్‌, ఆస్ర్టేలియా జట్ల మధ్య ఈనెల 19న జరిగే రెండో వన్డేకు ఏర్పాట్లు తుదిదశకు చేరుకున్నాయి. మంగళవారం స్టేడియంలో జరిగిన మ్యాచ్‌ నిర్వహణ కమిటీ సమావేశంలో ఏర్పాట్లకు సంబంధించి పలు విషయాలను వెల్లడించారు. ఆంధ్ర క్రికెట్‌ సంఘం (ఏసీఏ) కార్యదర్శి గోపీనాథరెడ్డి మాట్లాడుతూ టికెట్ల అమ్మకాలను ఈనెల పదో తేదీ నుంచి చేపట్టనున్నట్టు తెలిపారు. పేటీఎం ద్వారా ఈనెల పది నుంచి, ఆఫ్‌లైన్‌లో ఈనెల 13వ తేదీ నుంచి టికెట్ల విక్రయాలు జరుగుతాయని పేర్కొన్నారు. టికెట్ల ధరలు రూ.600, రూ.1,500, రూ.2,000, రూ.3,000, రూ.3,500, రూ.6,000గా నిర్ణయించినట్టు వెల్లడించారు. ఆఫ్‌లైన్‌లో టికెట్ల అమ్మకాలకు నగరంలో మూడు కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని, ఉదయం పది నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ ఈ విక్రయాలు జరుగుతాయని తెలిపారు. ఆఫ్‌లైన్‌ కేంద్రాల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. అయితే ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేసుకున్నవారు ఈనెల 13వ తేదీ నుంచి ఆఫ్‌లైన్‌ కేంద్రాల వద్ద ఫిజికల్‌ టికెట్లు పొందాల్సి వుంటుందని తెలిపారు. విశాఖలో దాదాపు నాలుగేళ్ల తర్వాత అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌ జరగనున్న నేపథ్యంలో విజయవంతంగా నిర్వహించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు.