నెట్‌వర్క్‌ 18, టీవీ 18 విలీనం

రిలయన్స్‌ గ్రూప్‌నకు చెందిన రెండు మీడియా సంస్థలు ఒకటి కానున్నాయి. నెట్‌వర్క్‌ 18 కంపెనీలోకి టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌తో పాటు ఈ18 కంపెనీలను విలీనం చేయనున్నారు. మనీకంట్రోల్‌ డాట్‌ కామ్‌ వెబ్‌సైట్‌ను ఇ-18 నిర్వహిస్తోంది. విలీనం తరవాత నెట్‌వర్క్‌ 18 కొనసాగనుంది. విలీన నిష్పత్తి ప్రకారం టీవీ 18కు చెందిన 172 షేర్లకు నెట్‌వర్క్‌ 18కు చెందిన 100 షేర్లు కేటాయిస్తారు. అలాగే ఇ-18కు చెందిన ప్రతి ఒక షేరుకు నెట్‌వర్క్‌ 18కు చెందిన 19 షేర్లు కేటాయిస్తారు. విలీనం తరవాత నెట్‌వర్క్‌ 18 చేతిలో 16 భాషల్లో 20 న్యూస్ ఛానల్స్‌ ఉంటాయి. అలాగే సీఎన్‌బీసీ టీవీ18 డాట్‌కామ్‌ వెబ్‌, 13 భాషల్లో ఉన్న న్యూస్‌ 18 డాట్‌కామ్‌ వెబ్‌సైట్‌ కూడా నెట్‌వర్క్‌ 18 చేతికి వస్తాయి. మనకంట్రోల్‌ డాట్‌ కామ్‌తో పాటు వయాకామ్‌ యాప్‌ (జియో సినిమాతో పాటు 40 టీవీ ఛానల్స్‌) కూడా నెట్‌వర్క్‌ 18 చేతికి వస్తాయి. అలాగే బుక్‌మైషో కంపెనీలో నెట్‌వర్క్‌ 18కు ఉన్న వాటా కొనసాగుతుంది. ఈ వార్త మార్కెట్‌కు ముందే లీక్‌ కావడం వల్లనేమో… గత ఇటీవల ఈ షేర్ల ధరలు భారీగా పెరిగాయి. టీవీ18 బ్రాడ్‌కాస్ట్‌ షేర్‌ రూ. 42 నుంచి రూ. 56కు చేరింది. అలాగే నెట్‌వర్క్‌ 18 షేర్‌ ధర రూ. 72 నుంచి రూ. 97.60కి పెరిగింది.