బ్యాంకులు ఇక వారానికి 5 రోజులే!

దేశంలో బ్యాంకులు ఇక వారానికి అయిదు రోజులే పనిచేయనున్నాయా? జాతీయ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి చూస్తే బ్యాంకులు వారానికి అయిదు రోజులు మాత్రమే పనిచేసే ప్రతిపాదనను ఇండియా బ్యాంక్‌ అసోసియేషన్‌ (IBA) చేసినట్లు తెలుస్తోంది. బ్యాంకులకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ అసోసియేషన్‌ నుంచి కేంద్ర ఆర్థిక శాఖకు ప్రతిపాదన వచ్చింది. కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్‌ కరత్‌ పార్లమెంటులో ఈ విషయాన్ని వెల్లడించినట్లు సమాచారం అందుతోంది. వారానికి అయిదు రోజులు మాత్రమే పనిచేసేలా ఐబీఏ నుంచి ప్రతిపాదన వచ్చినట్లు ఆయన వెల్లడించారు. అయితే ఈ ప్రతిపాదనపై కేంద్రం ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలుస్తోంది. సభలో మంత్రి ఈ ప్రతిపాదనకు మద్దతు తెలిపినట్లు కాని లేదా తిరస్కరించినట్లు గాని చెప్పలేదని వార్తలు వస్తున్నాయి.