గోల్డ్ బాండ్స్‌ను ఈనెల 12వ తేదీ నుంచి 16వ తేదీ వరకు అంటే అయిదు రోజుల పాటు జారీ చేయనున్నారు. ఒక్కో గ్రాము ధరను రూ.6,263గా ఆర్‌బీఐ నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో వస్తున్న నాలుగో సిరీస్ ఇది. గత ఏడాది జూన్, సెప్టెంబర్, డిసెంబర్‌లో మూడు విడతలుగా బాండ్లను విడుదల చేశారు. ఈ బాండ్ల కోసం ఆన్‌లైన్‌లో కొనుగోలు చేసే వారికి గ్రాముకు రూ.50 డిస్కౌంట్ కూడా ఇస్తారు. 2015 నవంబర్ నుంచి ప్రభుత్వం గోల్డ్ బాండ్స్‌ను జారీ చేస్తోంది. కనీసం 1 గ్రాము ఒక యూనిట్‌గా కొనాల్సి ఉంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు గరిష్ఠంగా 4 కేజీల వరకు కొనుగోలు చేయొచ్చు. ట్రస్టులైతే 20 కేజీల వరకు కొనొచ్చని ఆర్బీఐ వెల్లడించింది. ఈ బాండ్ పీరియడ్ 8 ఏళ్లు. గడువు ముగిశాక అప్పటి ధరను చెల్లిస్తారు. మూడేళ్ళ ముందే ఈ బాండ్ నుంచి వైదొలగితే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ బాండ్లు కొనేవారు కూడా కేవైసీ నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. బ్యాంకులతో పాటు పోస్టాఫీల ద్వారా ఈ బాండ్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ బాండ్ ఏడాదికి 2.50% ఫిక్స్‌డ్ రేటుతో వడ్డీ చెల్లిస్తారు. ఆరె నెలలకు ఒకసారి వడ్డీ లెక్కించి చెల్లిస్తారు.