క్షమాపణ చెప్పడానికి తన పేరు రాహుల్ సావర్కర్ కాదని కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితి దిగజారడం, ధరలు పెరగడం వంటి అంశాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఢిల్లీలోని ఓ భారీ సభ ఏర్పాటు చేసింది. ఈ సభలో రాహుల్ మాట్లాడుతూ…దేశానికి క్షమాపణ చెప్పాల్సింది ప్రధాని మోడీ, అమిత్ షాలేనని అన్నారు. దేశ ప్రధాని మోడీ మన దేశాన్ని మేకిన్ ఇండియా చేస్తానని హామి ఇచ్చారని, కాని ఆయన హయాంలో రేప్ ఇన్ ఇండియాగా మారిందని రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మహిళా ఎంపీలు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ తన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంటులో తనను క్షమాపణ చెప్పమని బీజేపీ అడిగినప్పుడు, నిజం మాట్లాడేవాళ్లు క్షమాపణలు చెప్పరని తాను తెగేసి చెప్పానన్నారు.
ఆర్థిక వ్యవస్థను ప్రధాని ధ్వసం చేశారని, రూ.500, రూ.1000 నోట్లు రద్దు చేసినప్పుడు ఎన్నో అబద్ధాలు చెప్పారని, నల్లధనం వెనక్కి తెస్తామన్నారని, అవినీతి నిర్మూలిస్తామని చాలా మాటలు చెప్పారని, అయితా ఆపని చేయగలిగారా? అని ప్రశ్నించారు. మన జేబుల్లో నుంచి తీసుకుని లక్షల కోట్లు అదానీ, అనిల్ అంబానీల జేబుల్లో వేశారని ఆరోపించారు.
పౌరసత్వ సవరణ చట్టంపైనా రాహుల్ విమర్శలు గుప్పించారు. ఈశాన్య ప్రాంతాల గోడు వినే పరిస్థితి లేకుండా పోయిందన్నారు.
ర్యాలీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ, సీనియర్ నేతలు పాల్గొన్నారు.