అదానీ చేతికి కృష్ణపట్నం పోర్టు

తూర్పుతీరంలో పట్టు కోసం అదానీ గ్రూప్‌ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. కృష్ణపట్నం పోర్టు కంపెనీ లిమిటెడ్‌ (కేపీసీఎల్‌)లో 75 శాతం వాటాను అదానీ పోర్ట్స్‌ అండ్‌ స్పెషల్‌ ఎకనమిక్‌ జోన్‌ (ఏపీఎస్‌ఈజెడ్‌) సొంతం చేసుకోనుంది. కృష్ణపట్నం పోర్టు విలువను రూ. 13,500 కోట్లుగా లెక్కించారు. 75 శాతం వాటా కింద రూ. 11,625 చెల్లించనుంది. దీనికి గాను రూ.5,625 కోట్ల మొత్తాన్ని నగదు రూపంలో కృష్ణపట్నం ప్రమోటర్లకు చెల్లించనుంది అదానీ. కంపెనీకి ఉన్న రూ.6,000 కోట్ల రుణాన్ని అదానీ తీసుకుంది. అదానీ పోర్ట్స్‌కు చెందిన ముంద్రా పోర్టు తర్వాత దేశంలోనే ప్రైవేటు రంగంలో కృష్ణపట్నం పోర్టు అతిపెద్దది. గత ఆర్థి క సంవత్సరంలో ఈ పోర్టు నుంచి 5.4 కోట్ల ట న్నుల కార్గో రవాణా అయింది. పోర్టు కార్గో హ్యాండ్లింగ్‌ సామర్థ్యం 6.4 కోట్ల టన్నులు. 2018- 19లో పోర్టు ఆదాయం రూ.2,394 కోట్లు ఉంది.

కాంపిటీషన్‌ కమిషన్‌ ఆఫ్‌ ఇండియా (సీసీఐ) తదితర నియంత్రణ సంస్థలు, చట్టబద్ధమైన అనుమతులు, ఆమోదాల మేరకు కృష్ణపట్నం పోర్టు కొనుగోలు పూర్తవుతుంది. అనుమతులకు అనుగుణంగా 120 రోజుల్లో పోర్టు తమ చేతికి వస్తుందని, నగదు చెల్లింపు ద్వారా దీన్ని కొనుగోలు చేస్తున్నామని ఏపీఎ్‌సఈజెడ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ కరణ్‌ అదానీ తెలిపారు.