బాయ్‌కాట్‌ నెట్‌ఫ్లిక్స్‌… ట్రెండింగ్‌

సోషల్‌ మీడియాలో ఉదయం నుంచి పెద్ద వార్తల్లేవ్‌. ఉన్నదల్లా ఒకే ఒక హాట్‌ టాపిక్‌… బాయ్‌కాట్‌ నెట్‌ఫ్లిక్స్‌. రేపు నెట్‌ఫ్లిక్స్‌లో ‘ద సూటబుల్ బాయ్‌’ సినిమా రిలీజ్‌ కానుంది. మీరా నాయర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా 1993లో వచ్చిన విక్రమ్‌ సేథ్‌ నవల ఆధారంగా తీసింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ నవల వాస్తవానికి 1951 నేపథ్యంతో సాగిన కథ. లత అనే యువతి మనుసు దోచుకునేందుకు ముగ్గురు యువకులు ప్రయత్నించడమే ప్రధాన కథ.

ఈ ముగ్గురు అబ్బాయిల్లో డానిష్‌ రజ్వి అనే కుర్రాడు కూడా ఉన్నాడు. త పాత్రను కబీర్‌ దురాని వేశారు. ఇక లత పాత్రను తాన్యా మనిక్‌టాలా వేశారు. ఇపుడు ‘బాయ్‌కాట్‌ నెట్‌ఫ్లిక్స్‌’కు ప్రధాన కారణం- సినిమాలోని ముద్దు దృశ్యం. ఓ దేవాలయంలో ఓ ముస్లిం అబ్బాయిని ఓ హిందూ అమ్మాయి ముద్దు పెట్టుకోవడం. ఈ స్టిల్‌ను ట్యాగ్‌ చేస్తూ… నెట్‌ఫ్లిక్స్‌ లవ్‌ జిహాద్‌ను ప్రమోట్‌ చేస్తోందంటూ నెటిజన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ బాయ్‌కాట్‌ అంటున్నారు. నెట్‌ఫ్లిక్స్‌ను వ్యతిరేకిస్తున్నవారు ముద్దు దృశ్యాన్ని వ్యతిరేకించడం లేదని, ఓ ముస్లిం అబ్బాయిని ఓ హిందూ అబ్బాయి ముద్దు పెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని కొందరు వివరణ ఇస్తున్నారు.

అసలు దేవాలయాల్లో ఈ దృశ్యాలేమిటి అంటూ మరికొందరు కామెంట్‌ చేస్తున్నారు. వీరికి వ్యతిరేకంగా హిందూ దేవాలయాల్లోని శృంగార దృశ్యాలను పోటీగా కొందరు ట్వీట్‌ చేస్తున్నారు. ‘ద సూటబుల్‌ బాయ్‌’ సినిమా గొడవపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మధ్యప్రదేశ్‌ హోం మంత్రి నరోత్తమ్‌ మిశ్రా ఓ వీడియోను ట్వీట్‌ చేశారు. అలాగే బీజేపీ నేత గౌరవ్‌ గోయల్‌ కూడా…నెట్‌ ఫ్లిక్స్‌పై ఐపీసీ సెక్షన్‌ 295ఏ కింద పోలీస్‌ స్టేషన్‌లో లేదా స్థానిక కోర్టులో కేసు పెట్టాల్సిందిగా పార్టీ కేడర్‌ను కోరారు. మొత్తానికి సామాజిక మీడియాలో మీరా నాయర్‌ సినిమా హాట్‌ టాపిక్‌గా మారింది. ‘ద సూటబుల్‌ బాయ్‌’ సినిమాకు కావాల్సినంత ప్రచారమూ దొరికింది.