సైబరాబాద్‌లోని కోకాపేట వద్ద అత్యున్నత ప్రమాణాలతో హెచ్‌ఎండీఏ అభివృద్ధి చేస్తున్న ‘నియోపొలిస్’ భారీ లేఅవుట్‌కు మరో ప్రత్యేకాకర్షణ రానుంది. ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి నేరుగా ఈ లేఅవుట్‌లోకి రాకపోకలు సాగించేలా కోకాపేట-గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌ల మధ్య ట్రంపెట్ (మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ ఆకారంలో) జంక్షన్‌ను పోలి ఉండేలా నిర్మిస్తున్నారు. నియో పొలిస్ భారీ లేఅవుట్‌ను చేసే నిర్మాణ సంస్థనే ఈ జంక్షన్‌ణు నిర్మిస్తోంది. ఇది పూర్తయితే శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం మార్గంతోపాటు గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్-కోకాపేట మధ్య ట్రాఫిక్ సమస్య శాశ్వతంగా తొలగి రాకపోకలు సులభం కానున్నాయి.158 కి.మీ పొడవుగల ఔటర్‌పై తొలిసారి ఫ్లైఓవర్‌తో ట్రంపెట్‌ను నిర్మిస్తున్నారు. ఇది అందుబాటులోకి వస్తే రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి, మోకిల ప్రాంతాల భూములకు భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉండనుంది. కోకాపేటలో మూవీ టవర్స్ వద్ద వందలాది ఎకరాల్లో లేఅవుట్లను సిద్ధం చేస్తున్న హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ.. ఇక్కడికి రాకపోకలు సులువుగా ఉండేందుకు ట్రంపెట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. గచ్చిబౌలి చౌరస్తా నుంచి ఔటర్ రింగు రోడ్డు పైకి వెళ్లేందుకు ప్రత్యేక మార్గం ఉంది. అయితే ఫైనాన్సియల్ డిస్ట్రిక్ వైపు నుంచి కోకాపేటకు రావాలంటే ప్రసుత్తం ఉన్న ఇంటర్‌చేంజ్‌లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. దీంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా రాకపోకలు సాగించేందుకు ట్రంపెట్ నిర్మాణాన్ని చేపట్టింది. శంకర్‌పల్లి ప్రధాన రహదారికి గచ్చిబౌలి ఐటీ కారిడార్ నుంచి రోడ్డు మార్గం అందుబాటులోకి వస్తుంది.