పెగాసస్ స్పైవేర్ పార్లమెంటులో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పెగాసస్ పై డిబేట్ జరిగేవరకూ.. పార్లమెంటును నడవనిచ్చేదే లేదంటోంది విపక్షం. 14 విపక్ష పార్టీలు .. ప్రభుత్వం తీరును తప్పుపడుతున్నాయి. చివరికి సుప్రీంకోర్టు సైతం.. పెగాసస్ అంశాన్ని విచారణకు స్వీకరించింది. పెగాసస్ తరహా స్పైవేర్ లను సాధారణంగా జాతి వ్యతిరేక శక్తులపై ప్రయోగిస్తారు. కానీ ఇక్కడ ఏకంగా దేశానికి చెందిన 300 మందికిపైగా ప్రముఖుల ఫోన్ నెంబర్లు, వారి మెయిల్స్ హ్యాక్ చేసేందుకు వాడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ జాబితాలో ఇద్దరు కేంద్రమంత్రులు, రాహుల్ గాంధీ, మమత బెనర్జీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, కొందరు న్యాయమూర్తులు , జర్నలిస్టులు, ఉన్నతాధికారులు ఉన్నట్లు సమాచారం.
అయితే.. ఇలాంటి స్పైవేర్ ను బీజేపీ ప్రభుత్వం.. ప్రత్యర్థుల వ్యూహాలు తెలుసుకునేందుకు , తద్వారా లబ్దిపొందేందుకు ప్రయత్నించిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. కర్ణాటకలో గత కాంగ్రెస్ సర్కార్ సైతం.. పెగాసస్ స్పైవేర్ కారణంగా, కుప్పకూలిందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది. సొంత ప్రజలపై నిఘా పెట్టడం.. కచ్చితంగా దేశద్రోహమేనంటున్నాయి విపక్షాలు. కేంద్రంతో తేల్చుకునేందుకు సిద్ధమైన విపక్షాలు.. హోంమంత్రి అమిత్ షా రాజీనామాకు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం లేదని తోసిపుచ్చినా, విపక్షాలు మాత్రం ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు. బీజేపీ సర్కార్ తో తాడోపేడో తేల్చుకోవడానికే సిద్ధమయ్యాయి.
పెగాసస్ వ్యవహారంలో కేంద్రం ఇరుకున పడినట్లు కనిపిస్తోంది. విపక్షాలు గట్టిగా ప్రశ్నిస్తున్నా.. చర్చిద్దామంటోంది తప్ప, కన్విన్స్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఇజ్రాయెలీ సంస్థ నుంచి పెగాసస్ కొన్నారా లేదా అని రాహుల్ .. పార్లమెంటు వేదికగా ప్రశ్నించినా,…సమర్థవంతంగా బదులివ్వలేకపోతోంది.ఇప్పుడు వ్యవహారం సుప్రీంకోర్టు చెంతకు చేరింది. జ్యుడీషియల్ విచారణలో స్వైవేర్ ఉదంతంలో కేంద్రం పాత్ర ఉందని తేలితే, ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయో అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు.. ఇజ్రాయెల్ ప్రభుత్వం సైతం.. పెగాసస్ స్పైవేర్ విక్రయించే NSO గ్రూపు ఆఫీసుల్లో సోదాలు నిర్వహించింది. పూర్తి ఆధారాలు సేకరిస్తోంది.