అగ్రరాజ్యం అమెరికాను మళ్లీ కరోనా కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో దాదాపు లక్షన్నర కొత్త కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఫిబ్రవరి తర్వాత మళ్లీ ఇంత భారీగా కేసులు నమోదవడం ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా ఫ్లోరిడా, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లోనే కొత్త కేసులు రికార్డు స్ధాయిలో నమోదవుతున్నాయి. మంగళవారం ఒక్కరోజే 1,49,788 ఇన్‌ఫెక్షన్లు బయటపడగా.. మొత్తం కొవిడ్ కేసుల సంఖ్య 3.53 కోట్లకు చేరింది. అలాగే, తాజాగా మరో 668 మంది మృతి చెందగా.. ఇప్పటివరకు కొవిడ్ కాటుకు బలైపోయిన వారి సంఖ్య 6.14లక్షలకు చేరింది. అమెరికాలోని పలు ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ రేటు తగ్గుముఖం పట్టడం, డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందడమే తాజా ఉద్ధృతికి కారణమని నిపుణులు అంటున్నారు.