అరుణ్ సాగర్ అవార్డుల ప్రదానం

ప్రముఖ కవి, పాత్రికేయుడూ అయిన అరుణ్ సాగర్ స్మారక అవార్డుల ప్రదాన కార్యక్రమాన్ని ఇవాళ హైదరాబాద్ లోని సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో నిర్వహించారు. ప్రముఖ కవి, విమర్శకులు ప్రసాదమూర్తికి విశిష్ట సాహిత్య పురస్కారం, ఈనాడు ఆంధ్రప్రదేశ్‌ సంపాదకులు ఎం. నాగేశ్వరరావు రావుకు విశిష్ట పాత్రికేయ పురస్కారం లభించాయి. సభకు తెలంగాణ మీడియా అకాడమీ అధ్యక్షులు అల్లం నారాయణ అధ్యక్షత వహించారు. అరుణ్ సాగర్ ట్రస్ట్ ఏటా ఈ అవార్డులను ఇస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతిభావంతులైన యువత జర్నలిజం లోకి రావడం లేదనీ, ప్రధాన స్రవంతి మీడియా క్రమేణా తన ప్రాభవాన్ని కోల్పోతోందనీ ఆవేదన వ్యక్తం చేశారు ఈనాడు ఎడిటర్ నాగేశ్వరరావు. ఉత్తమ గుణాలు ఉన్నవారిని, సమర్థులను ఆకర్షించడం మీడియాకు పెద్ద సవాలుగా మారిందన్నారు. ఎలాంటి సంస్థకైనా మంచి మానవ వనరులు చాలా ముఖ్యమని ఆయన అన్నారు. అరుణ్ సాగర్ ది గొప్ప వ్యక్తిత్వమనీ, ఆయన తన కోసం కాక సమాజం కోసం పని చేయాలని భావించేవారనీ అంటూ అరుణ్ సాగర్ తో తన అనుబంధాన్ని ఈ సందర్భంగా నాగేశ్వరరావు గుర్తు చేసుకున్నారు.
మూడు దశాబ్దాలకు పైగా ఒకే సంస్థలో పనిచేస్తూ సబ్ ఎడిటర్ గా చేరి సంపాదకుడి స్థాయికి ఎదగడం వృత్తి పట్ల నాగేశ్వరరావు నిబద్ధతకు నిదర్శనమని సన్మాన పత్రంలో కొనియాడారు నిర్వాహకులు.

అతడే అవార్డు అయ్యాడు…
తాను తన సొంత కుటుంబంతో గడిపిన సమయం కన్నా అరుణ్ సాగర్ తో కలిసి గడిపిన సమయమే ఎక్కువ అని ఆత్మీయంగా గుర్తు చేసుకున్నారు విశిష్ట సాహిత్య పురస్కారాన్ని అందుకున్న ప్రసాద మూర్తి. ఆయన మాట్లాడుతూ … మనకి ఎప్పుడు అవార్డులు వస్తాయని అరుణ్ అనేవాడనీ అతడే అవార్డుగా మారతాడని అనుకోలేదనీ, ఆ తమ్ముడి పేరుతో అవార్డు అందుకోవడం ఆనందంగా ఉంద”నీ చెబుతూ భావోద్వేగానికి గురయ్యారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రజ్యోతి ఎడిటర్‌ శ్రీనివాస్‌, ఎమ్మెల్సీ, ప్రజా వాగ్గేయకారుడు గోరటి వెంకన్న, ప్రముఖ కవి శివారెడ్డి, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ తదితరులు పాల్గొన్నారు. అవార్డు కింద తనకు అందచేసిన నగదును అరుణ్ సాగర్ కుమార్తె స్మిత చదువు నిమిత్తం ఖర్చు చేయవలసిందిగా కోరుతూ నాగేశ్వరరావు ఆ సొమ్మును స్మితకు అందజేశారు.